యన్ వి ఎల్ తెలుగు గ్రంథాలయం ప్రారంభం
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా ఒక తెలుగు గ్రంథాలయం ప్రారంభం అయ్యింది. డల్లాస్ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారికి అందుబాటులో ఉండేలా, ప్రవాస భారతీయలకు సుపరిచితులు, ప్రముఖ సామాజిక నాయకులు శ్రీ నలజల నాగరాజు గారు తమ తండ్రి కీర్తి శేషులు శ్రీ నలజల వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం తన స్వగృహమందు శ్రీ యన్ వి ఎల్ స్మారక తెలుగు లైబ్రరీని ప్రారంభించారు. 200 మందికి పైగా తెలుగు వారు ఉత్సహాంగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి శుభం ఫౌండేషన్ నుండి శ్రీ పోణంగి గోపాల్ గారు అధ్యక్షత వహించారు.
గ్రంథాలయాన్ని తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు శ్రీ తోటకూర ప్రసాద్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ స్థాపకులు నలజల దంపతులు నాగరాజు మరియు సునీత, వారి కుటుంబ సభ్యులు గణేష్ మరియు గాయత్రి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రతినిధి మురళి వెన్నం, టాంటెక్స్ తెలుగు సంఘ సాహిత్య వేదిక నిర్వాహకులు దయారక్ మాడా, టాంటెక్స్ సాహిత్య వేదిక ప్రతినిధి లెనిన్ వేముల, ప్రముఖ వైద్యులు, సాహితీ వేత్త డా శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, తెలుగు సంఘ ప్రతినిధి, సాహితీ వేత్త యమ్ వి యల్ ప్రసాద్, బి ప్లస్ - కథా సాహిత్య వేదిక నిర్వాహకులు భాస్కర్ రాయవరం, మనబడి నిర్వాహకులు ప్రసాద్ జోస్యుల, ప్రముఖ గాయని లక్ష్మి అద్దంకి, ఆన్ లైన్ ద్వారా ప్రముఖ కవి సుందరరావు బీరం, బీరం సోదరులు గోపి, సాయిచంద్, నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యలు కిషోర్ నారె, పూర్వ అధ్యాపకులు, సాహితీవేత్త పురుషోత్తమ రెడ్డి పాల్గొన్నారు.
సభకు విచ్చేసిన ప్రముఖులు గ్రంథాలయం యొక్క విశిష్టతని, గ్రంథాలయ స్థాపనకు కారణమైన నాగరాజు గారి ఉన్నత భావజాలాన్ని కొనియాడారు.