జయరాం కోమటి ఆధ్వర్యంలో... బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు-మినీ మహానాడు

తెలుగువారు ఇష్టపడే నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని దశ దిశలా చాటిన తెలుగు తేజం ‘ఎన్టీఆర్’ శత జయంతి వేడుకలను ఎన్నారై టీడిపి బే ఏరియా ఆధ్వర్యంలో, ఎన్నారై టీడిపి అమెరికా కన్వీనర్ జయరాం కోమటి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మిల్‌పిటాస్‌లో జూలై 31వ తేదీన జరిగినఈ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మినీ మహానాడును కూడా జరిపారు.
ఈ సందర్భంగా సినీ రంగంలో తనదైన శైలిలో ఆ చంద్రతారార్కం కీర్తిని సొంతం చేసుకున్న అన్నగారు, తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారి కీర్తిని ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని, ఆ తరువాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు నాటి ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చేశారని, ఐటీరంగానికి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చారని వక్తలు పేర్కొన్నారు.
బే ఏరియాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 3వ మినీ మహానాడు కార్యక్రమానికి జయరాం కోమటి అధ్యక్షత వహించారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆన్‌లైన్‌లో ప్రసగించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు అనేక సందర్భాల్లో బాగా స్పందించారు. రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారు. మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వరద బాధితులను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు వయస్సును కూడా లెక్కచేయకుండా తక్షణమే స్పందించి వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తెలుగుదేశం పార్టీ బాధితులకు సహాయం అందించడం అభినందనీయం’’ అని తెలిపారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ..‘‘మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉంటే పరిశ్రమలు, కంపెనీలు, పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యమంత్రి అసమర్థత, ఆర్థిక, రాజకీయ విధానాల వల్ల పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. రహదారులు, ఇసుక, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక వనరులు అందుబాటులో లేకుండా పోయాయి’’ అని అన్నారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్‌గా మార్చారు. జూదం, మద్యం అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సాక్షాత్తూ వైసీపీ నాయకులే క్యాసినోను నడిపిస్తున్నారు. పన్నులు, ధరల పెంపుతో సామాన్యుడి బతుకు దుర్భరంగా మారింది. ముఖ్యమంత్రి పాలన చేతకాక చేతులెత్తేశారు. తన అసమర్థతకు, చేతగానితనానికి, వైఫల్యాలకు చంద్రబాబును బూచిగా చూపెడుతున్నారు. అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు చంద్రబాబు నాయుడును తిరిగి ముఖ్యమంత్రిని చేసేవరకు నిరంతరం కృషి చేయాలి’’ అని అన్నారు.
అనంతరం.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి, సంక్షోభంలో విద్యారంగం, వరద బాధితులను ఆదుకోవాలి, రహదారులు- నరక కూపాలు, రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలి, సభ్యత్వ నమోదు పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి పలు తీర్మానాలను మన్నవ సుబ్బారావు ప్రవేశపెట్టారు.
ఈ కార్యక్రమంలో వెంకట్ కోగంటి, ప్రసాద్ మంగిన, వీరు ఉప్పల, శ్రీకాంత్ దొడ్డపనేని, లక్ష్మణ్ పరుచూరి, గుమ్మడి విజయకృష్ణ, శ్రీని వల్లూరిపల్లి, చంద్ర గుంటుపల్లి, సతీష్ అంబటి, సతీష్ చిలుకూరి, రజనీ కాకర్ల, జెట్టి వెంకయ్య, హేమారావు నందిపాటి, భరత్ ముప్పిరాల, లియోన్ రెడ్డి, సుధీర్ ఉన్నం, విజయ ఆసూరి, శ్రీలు వెలిగేటి, శ్రీదేవి, భాస్కర్ వల్లభనేని, రాజా కొల్లి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రవి గూడిపాటి, మురళి పి. ఎన్టీఆర్ పాటలను పాడి అందరినీ పరవశింపజేశారు.