వాషింగ్టన్ డీసీలో భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో ఎన్నారైల భేటీ

వాషింగ్టన్ డి.సి లో భారత రాయబార కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండేను పలు ప్రవాస సంఘాల పెద్దలు మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా మాతృదేశంలో జరిగే ఎన్నికలలో ఓటు హక్కు, .. ప్రవాస భారతీయులు,, పాల్గొనటంపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. ఇప్పటికే పలు భారతీయ ప్రవాస సంఘాలు ఓటు హక్కు, దాని విలువ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రవాసుల పాత్రపై పలు నిర్మాణాత్మక అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ క్రమంలో పలు దేశాలలో ఉన్న వివిధ రాయబార కార్యాలయాలలో ప్రవాసులు ఓటు వేసే అవకాశం కలిపించే దిశగా లోతుగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పలువురు వక్తలు, ప్రవాస సంఘ పెద్దల ఆలోచనలను, అభిప్రాయాలను ఎలక్షన్ కమిషన్ సభ్యులు నమోదు చేసుకొని, ఓటుహక్కు కల్పించటానికి గల ప్రతి అవకాశాన్ని చర్చించి, ఆమోదయోగ్యమైన పరిస్థితులను అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు.
మొత్తంగా ఈ సమావేశం చాలా సంతృప్తికరంగా ముగిసింది. తత్ఫలితంగా దీర్ఘ కాలంగా విదేశాలలో ఉంటున్న భారతీయుల కలను నిజం చేసే దిశగా, ప్రజాస్వామ్య దేశంలో ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కు అయిన ఓటును వినియోగించుకొని తమ గళాన్ని సైతం వినిపించే అవకాశం నిజమవ్వాలని కోరుకుందాం.
ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, ఎన్.సి.ఏ.ఐ.ఏ అధ్యక్షులు సునీల్ సింగ్, పలు భారతీయ ప్రవాస సంఘాల పెద్దలు, క్రాంతి దూదం, భాను ప్రకాష్ మాగులూరి, మల్లికార్జున్ బొరుగు తదితరులు భారతదేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండేను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేసారు.