బాబీతోనే NBK109
వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ సినిమాను అనిల్ రావిపూడితో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈ నెల 8న రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీతో బాలయ్య నెక్ట్స్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా రానుందట. గతంలో దిల్ రాజు బ్యానర్ లో రజినీకాంత్ తో బాబీ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని తేలిపోగా , బాబీ సైలెంట్ గా బాలయ్య తో సినిమాను సెట్ చేసుకున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ మూవీ గురించి వంశీ గతంలో అన్‌స్టాపబుల్ షో కు వచ్చినప్పుడే హింట్ ఇచ్చినప్పటికీ అప్పుడు డైరెక్టర్ ఎవరనేది చెప్పలేదు. ప్రస్తుతం బాలయ్య అనిల్ తో చేస్తున్న సినిమా పూర్తవగానే బాబీతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని అంటున్నారు.
ఎలాగూ సితార బ్యానర్ కాబట్టి త్రివిక్రమ్ ప్రమేయం ఈ మూవీలో ఉండనుంది. ఈ సినిమాకు కూడా థమన్ యే సంగీతం అందించనున్నాడని తెలుస్తోంది. 2024 సమ్మర్ రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకుని సినిమాను స్టార్ట్ చేయనున్నారట. అంటే బాలయ్య కోసం ఆశలు పెట్టుకున్న బోయపాటి, పూరీల సినిమాలు లేటయ్యే అవకాశముందన్నమాట.