గ్రామాభివృద్ధికి యువత కృషి చేయాలి` వెంకయ్యనాయుడు

గ్రామాభివృద్ధికి యువత కృషి చేయాలి` వెంకయ్యనాయుడు

గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు నిపుణులైన యువత ముందుకు రావాలని, యువతలోని నైపుణ్యానికి మెరుగులు దిద్దేందుకు విద్యాసంస్థలు, కార్పొరేట్‌, వ్యాపారసంస్థలు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ విజయవాడ చాప్టర్‌లో విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. రాజకీయ పార్టీలు ప్రజలకు నైపుణ్యాభివృద్ధిని అందించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు సహకరించాలేగానీ ఉచితాలను అలవాటు చేయడం వలన ప్రయోజనం ఉండదని చెప్పారు. సంతోషమయ జీవనానికి సేవే అత్యుత్తమ సాధనమని, ఆధ్యాత్మికతలోని అంతరార్థం సాటివారికి సేవచేయడమేనని పేర్కొన్నారు. మాతృభాషను, సంస్కృతిని పరిరక్షించుకుని ముందుతరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. తొలుత చేతన ఫౌండషన్‌, రామినేని ఫౌండేషన్‌ సంయుక్తంగా మహిళలకు అందజేసిన కుట్టుమిషన్లు, బాలబాలికలకు సైకిళ్లు, చిరు వ్యాపారులకు తోపుడు బళ్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వెనిగళ్ల రవి, ఉపాధ్యక్షుడు మోదుకూరి నారాయణరావు, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, రామినేని ఫౌండేషన్‌ నిర్వాహకుడు రామినేని ధర్మప్రచారక్‌, ట్రస్ట్‌ ట్రస్టీలు, డైరెక్టర్‌ పరదేశి, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Tags :