దక్షిణ భారతదేశ గోల్డ్ హబ్‌గా మంగళగిరి : మంత్రి లోకేశ్
మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని భద్రావతి సమేత భావనా రుషి ఆలయ కల్యాణ మండపాన్ని మంత్రి లోకేశ్ ప్రారంభించారు. ఆలయంలో లోకేశ్ బ్రహ్మణీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి నూతన వస్త్రాలు అందజేసి వేదాశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ మంగళగిరిని దక్షిణ భారతదేశ గోల్డ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో అత్యధికంగా ఉన్న స్వర్ణకారులు, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అధునాతన ఆకృతులు, ఇతర నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలనూ లోకేశ్ నెరవేరుస్తారని ఆయన సతీమణి బ్రాహ్మణి తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు కరసత్తు చేస్తున్నట్లు తెలిపారు.