అందుకే ఈ అక్రమ అరెస్టులు : లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన కళ్ల ముందు ఓటమి కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో పునాదులు కదులుతున్నాయి, ఆ అసహనం వల్లే అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఇంఛార్జి ప్రవీణ్ రెడ్డి, పులివెందుల ఇంఛార్జి బీటెక్ రవిల అరెస్టుతోనే ప్రతిపక్షం అంటే జగన్ ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోందని విమర్శించారు. పులివెందులలో టీడీపీ స్పీడు పెరగడంతో తన మార్కు అక్రమ కేసులతో భయపెట్టే చర్యలకు జగన్ దిగారని దుయ్యబట్టారు.
ఏ సీఎం అయినా, వారి సొంత జిల్లాలో చేసిన అభివృద్ధి పనుల గురించో, కట్టిన ప్రాజెక్టుల గురించో, తెచ్చిన కంపెనీల గురించో చెబుతారు. కానీ జగన్ మాత్రం ఏ నియోజకవర్గంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టారో మాత్రమే చెప్పగలరని ఎద్దేవా చేశారు. సైకో చర్యలతో జగన్ తన సొంత పార్టీకే రాజకీయ సమాధి కట్టుకున్నారన్నారు. ఈ అక్రమ కేసులు, బెదిరింపు రాజకీయాలు వైసీపీని బతికించలేవని తెలిపారు. అక్రమ పద్దతుల్లో సహకరిస్తున్న పోలీసులు లేకపోతే రాష్ట్రంలో వైసీపీ అనే పార్టీయే లేదని ధ్వజమెత్తారు. జగన్ పెట్టే ప్రతి కేసు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతుంది తప్ప ప్రజల పక్షాన తమ పోరాటాన్ని ఆపదని లోకేశ్ స్పష్టం చేశారు.






