నాని సినిమాలకు బడ్జెట్ పెంచేస్తున్నారుగా
అష్టాచెమ్మా సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన నాని కమర్షియల్ హీరో అనిపించుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. 2015 వరకు అతను సాలిడ్ గా వరుస హిట్స్ అందుకుంది లేదు. ఆ తర్వాత నాని చేసిన సినిమాలు హిట్టవడంతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అప్పటినుంచి తన ప్రతీ సినిమాకు నాని ఇమేజ్ పెరుగుతూనే వచ్చింది.
వరుస హిట్స్ అందుకుంటూ నాని, నిర్మాతలకు మంచి భరోసా ఇస్తున్నాడు. దసరా సినిమా ముందు వరకు నాని సక్సెస్ లు అందుకున్నప్పటికీ తనతో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి మాత్రం నిర్మాతలు వెనుకడుగు వేసేవారు. కానీ దసరా తర్వాత నాని రేంజ్ మారిపోయింది. ఆ సినిమాతో నాని ఏకంగా రూ.117 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు భారీ లాభాలు అందించాడు.
తర్వాత వచ్చిన హాయ్ నాన్న కూడా నిర్మాతలకు లాభాల్నే మిగిల్చింది. ఇక రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం రూ.100 కోట్ల దిశగా దూసుకెళ్తుంది. నాని కెరీర్లో సెకండ్ హయ్యెస్ట్ మూవీగా సరిపోదా శనివారం ఉంది. వరుసగా మూడు భారీ విజయాలు అందుకోవడంతో నిర్మాతలకు నాని మార్కెట్ మీద నమ్మకం పెరిగి తనతో భారీ బడ్జెట్ సినిమాలు తీయాలని నాని వెంట క్యూ కడుతున్నారు. ప్రస్తుతం సొంత బ్యానర్ లో హిట్3 తీస్తున్న నాని ఆ సినిమాకు రూ.70 కోట్లు ఖర్చు పెడుతున్నాడట. ఆ తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న సినిమాను రూ.100 కోట్లతో నిర్మించడానికి సుధాకర్ చెరుకూరి రెడీగా ఉన్నాడట. వాటి తర్వాత ఎలాగూ నాని మార్కెట్ పెరుగుతుంది కాబట్టి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు రూ.150 కోట్ల బడ్జెట్ ను పెట్టడానికి రెడీగా ఉన్నారట నిర్మాతలు. ఎంత బడ్జెట్ పెట్టినా వెనక్కి తీసుకురాగల హీరోగా నాని ఇప్పుడు మారాడని, నానితో నిర్మాతలకు ఎలాంటి రిస్క్ ఉండదని ట్రేడ్ పండితులంటున్నారు.