పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను కార్యకర్తగా పనిచేస్తా! : నాగబాబు

అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి, భవిష్యత్ తరాలను కాపాడుకోవడానికి జనసేనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా జనసేన నాయకులు ప్రచారం నిర్వహించాలని ఆ పార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు సూచించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అవినీతి అనే పదమే వినిపించదని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను కార్యకర్తగా పనిచేస్తానని ఆ పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు అన్నారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి..? పార్టీ సిద్దాంతాలను ప్రజలకు ఎలా వివరించాలి..? అనే విషయాలపై అవగాహన కల్పించారు. జనసేన గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాగబాబు సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో అమూల్యమైన వనరులు ఉన్నా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజా ఆమోద పరిపాలన అందించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దోపిడీకి గురవుతున్న రాష్ట్ర ఆర్థిక వనరులు, ప్రకృతి సంపదను కాపాడే సమర్థత జనసేన పార్టీకి మాత్రమే ఉందన్నారు. 'రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జనసేన దగ్గర వినూత్నమైన ప్రణాళికలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే అవినీతి అనే పదమే వినపడకుండా ప్రజా ప్రయోజన పరిపాలన అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకూ నేనూ ఒక కార్యకర్తగా పని చేస్తా.. రానున్న ఎన్నికలే లక్ష్యంగా గ్రామీణ స్థాయిలో విస్తరించి పని చేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు అంతా సమష్టిగా పని చేయాలి..' అని నాగబాబు సూచించారు.






