‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ రీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసిన నాగబాబు, శ్రీకాంత్
మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా 2004లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాంటి కల్ట్ క్లాసిక్ హిట్‌ను మళ్లీ థియేటర్లోకి తీసుకొస్తున్నారు. మెగా ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం నవంబర్ 4న భారీ ఎత్తున రీ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మెగా బ్రదర్ నాగబాబు, హీరో శ్రీకాంత్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం..
నాగబాబు గారు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ప్రతీ 20 ఏళ్లకు ఓ జనరేషన్ మారుతుంటుంది. టీవీ, యూట్యూబ్‌లో పాత సినిమాలను చూడరు. కానీ ఇలాంటి సినిమాలకు రిపీటెడ్ ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు థియేటర్లో రిపీటెడ్ రన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఓటీటీ, చానెళ్లకు సినిమాలు వెళ్లిపోతున్నాయి. ఇలాంటి సినిమాలను థియేటర్లోనే ఎక్స్‌పీరియెన్స్ చేయాలి. మళ్లీ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. అప్పుడు అన్నయ్య గారు ఎంతో అందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏదో అలా వస్తే చిన్న సీన్ చేయించారు. వైష్ణవ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. నా ఫ్రెండ్ ఆహుతి ప్రసాద్ ఇప్పుడు లేరు. ట్రైలర్ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘2004ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. నేను హీరోగా ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే మున్నాభాయ్ లగేరహో రీమేక్ గురించి వార్త వినిపించింది. 'హీరో పక్కన ఉండే కారెక్టర్ నాకు ఎలా ఉంటుంది అన్నయ్యా?' అని చిరంజీవి గారిని అడిగాను. నవ్వి వదిలేశారు. చివరకు ఆ పాత్ర నాకు వచ్చింది. అన్నయ్యతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయనది ఎంతో కష్టపడేతత్త్వం. ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోంది. పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. వెస్ట్ గోదావరి ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ టైంలో నాకు ఎంతో లాభాన్ని తెచ్చి పెట్టింది. ఈ సినిమాతోనే నాకు మెగా డిస్ట్రిబ్యూటర్ అనే పేరు వచ్చింది. అలాంటి సినిమా మళ్లీ రీ రిలీజ్ అవుతుండటం నాకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.
ధర్మేంద్ర మాట్లాడుతూ.. ‘నాగబాబు గారు మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. శ్రీకాంత్ గారు మాకు ఎప్పుడూ ఏటీఎం లాంటి వారే. నవంబర్ 4న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామ’ని అన్నారు.