వారిని వదిలే ప్రసక్తే లేదు... అరెస్టు చేస్తాం : మంత్రి నాదెండ్ల
పౌరసరఫరాల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఓ కటుంబం కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని, రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. జూన్‌లో నిర్వహించిన తనిఖీల్లో 26 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడిరచారు. రేషన్ బియ్యం అక్రమాల కేసులో విచారణ కొలిక్కి వచ్చిందని తెలిపారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఓ కుటుంబ కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ భవవిష్యత్ కోసం. ఈ ప్రాంతానికి పెట్టుబడులు రావాలన్న ఉద్దేశంతోనే పోర్టును ఏర్పాటు చేశారు. కానీ, గత ఐదేళ్లలో ఇక్కడికి ఇతరులెవరూ రాకుండా వైసీపీ నేతలు హుకుం జారీ చేసి, అక్రమాలకు పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులకు అనుమతి లేకుండా చేశారు. ఇక్కడి రేషన్ బియ్యాన్ని నూకలు, ఉప్పుడు బియ్యం పేరుతో రీ ప్యాకింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. అక్రమాలకు పాల్పడిన వారెవ్వరినీ వదలం. చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటాం. త్వరలోనే 41ఏ ద్వారా నోటీసులిచ్చి అరెస్టు చేస్తాం. కాకినాడ పోర్టులో పని చేస్తున్న ఉద్యోగులు, హమాలీల సమస్యలను పరిష్కరిస్తాం అని తెలిపారు.