ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మస్క్
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. అయితే ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇంజినీరింగ్ విభాగపు ఉద్యోగులకు పెద్ద మొత్తంలో లే ఆఫ్‌లు ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రెండు నెలల క్రితం కంపెనీకి సంబంధించిన విషయాలపై ఎక్స్ యాజమాన్యం ఉద్యోగులను ఓ పేజీ నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా మెయిళ్ల ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించినట్లు సమాచారం. అయితే ఉద్యోగుల తొలగింపుపై యాజమాన్యం బహిరంగంగా స్పందించలేదు. 2022 అక్టోబరులో ఎలాన్ మస్క్ ఎక్స్ ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ విలువ సుమారు 44 బిలియన్లు. అప్పట్లో ఈ సంస్థలో ఉన్న 6,000 మంది ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మందిని తొలగించారు. ఈ ఏడాది జనవరిలో ఆన్‌లైన్‌లో విద్వేషపూరిత కంటెంట్ రాకుండా పర్యవేక్షించే 1,000 మంది సేఫ్టీ సిబ్బందిని ఎక్స్ తొలగించింది. కాగా సంస్థలో వస్తున్న వివిధ ఒడుదుడుకలు కారణంగా ప్రస్తుతం ఎక్స్ విలువ 9.4 బిలియన్ డాలర్ల (రూ.79వేల కోట్లు)కు పడిపోయింది.