రివ్యూ : రొటీన్ పిచ్చర్ సే బచావ్ 'మిస్టర్ బచ్చన్'!
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 2.5/5
నిర్మాణ సంస్థలు : నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పనోరమా స్టూడియోస్, అండ్ T సిరీస్ ఫిలిమ్స్,
నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, తదితరులు
సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫీ: అయానక బోసే
ఎడిటర్ : ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అభిషేక్ పాఠక్
రచన, దర్శకత్వం : హరీశ్ శంకర్
విడుదల తేదీ : 15.08.2024
'మిస్టర్ బచ్చన్' చిత్రం తో రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఉండే అంచనాలు అందలం ఎక్కుతాయి. అయితే ఇది అజయ్ దేవగణ్ రైడ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే హరీష్ శంకర్ ఓ రీమేక్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అందరికీ తెలిసిందే. ఒరిజినల్ సినిమాలోని సారాన్ని మాత్రమే తీసుకుని.. తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో అది యాడ్ చేస్తుంటాడు. మాస్ మసాలా అంశాలను జొప్పించి.. హీరోయిన్ ట్రాక్‌ను మాస్ ఆడియెన్స్‌కు నచ్చేలా డిజైన్ చేస్తాడు. ఓ నాలుగు ఫైట్లు, ఐదు మంచి సాంగ్స్.. ఓ పది పంచ్ డైలాగ్స్ రాసుకుంటాడు. ఆ విధంగా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మిస్టర్ బచ్చన్ మీద అంచనాలు పెంచేశాడు హరీష్ శంకర్. అజయ్ దేవగణ్‌కి, రవితేజకు ఎంత వ్యత్యాసం ఉంటుందో.. రెయిడ్కి, మిస్టర్ బచ్చన్‌కి అంత తేడా ఉంటుందని చెప్పాడు హరీష్ శంకర్. ఈ చిత్రం ఈ రోజు ఆగస్ట్ 15న విడుదల విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఫ్యాన్స్‌కి, ఆడియెన్స్‌కి ఏ మేరకు నచ్చుతుందో సమీక్షలో చూద్దాం.
కథ:
ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ గల గవర్నమెంట్ అధికారి. అవినీతికి వ్యతిరేకి. ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్‌గా మిస్టర్ బచ్చన్ ఎన్నో రైడ్స్ చేసి ఎన్నో వందల కోట్ల నల్లధనాన్ని వెలికి తీస్తాడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో, ఆగ్రహించిన పైఅధికారులు మిస్టర్ బచ్చన్ ని డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వెళ్లి ఆర్కెస్టాను రన్ చేస్తుంటాడు. అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు.
మరో వైపు ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) అరాచకాలు మితి మీరి పోతుంటాయి. తన మీదకు వచ్చే ప్రభుత్వ అధికారుల్ని, ఎదురు తిరిగిన వారిని హత మార్చుతుంటాడు. అలాంటి ముత్యం జగ్గయ్య మీదకు మిస్టర్ బచ్చన్ లాంటి వాడ్ని ఐటీ రైడ్స్‌కు పంపిస్తారు. ముత్యం జగ్గయ్యను మిస్టర్ బచ్చన్ ఎలా ఎదుర్కొంటాడు? ముత్యం జగ్గయ్య ఇంట్లోని నల్లధనాన్ని మిస్టర్ బచ్చన్ పట్టుకుంటాడా? మిస్టర్ బచ్చన్‌ను ఎదుర్కొనేందుకు ముత్యం జగ్గయ్య ఏం చేస్తాడు? జిక్కీ ప్రేమ కోసం బచ్చన్ ఏం చేశాడు ?, బచ్చన్ తో జిక్కీ ఎలా ప్రేమలో పడింది ?, వీరి ప్రేమ విషయం ఇంట్లో ఎలా తెలిసింది ?, పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి ?, చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు ? అనేది మిగిలిన కథ.
నటీనటుల హావభావాలు :
రవితేజ లుక్స్, ఎనర్జీ బాగుంది. మిస్టర్ బచ్చన్ గా చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. తన శైలి కామెడీ టైమింగ్ తో పాటు స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్ తో మరియు బలమైన ఎమోషన్స్ తోనూ రవితేజ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. రవితేజ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో మరియు తన లుక్స్ తో రవితేజ చాలా బాగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్ తో అలరించింది. ముఖ్యంగా సాంగ్స్ లో భాగ్యశ్రీ బోర్సే లుక్స్, స్టెప్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. భాగ్య శ్రీ అందాలు తెరపై కుర్రకారుని మెప్పిస్తాయి. ట్రాక్‌ను అయితే కేవలం గ్లామరస్ కోసమే వాడుకున్నాడు. ఆమె డబ్బింగ్ కూడా అంతగా నచ్చకపోవచ్చు. తణికెళ్ల భరణి, సచిన్ ఖేదేకర్ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. జగపతి బాబు విలనిజం రొటీన్‌లా అనిపిస్తుంది. సత్య కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తుంది. చమ్మక్ చంద్ర, రోహిణి, అన్నపూర్ణ పాత్రలు విసిగిస్తాయి. సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ ఓకే అనిపిస్తుంది.. కానీ లాజిక్ లెస్‌గా ఉంటుంది. ఆ మాడ్యులేషన్ కూడా మళ్లీ డీజే టిల్లు టైపులోనే ఉంటుంది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఓకే అనిపించారు.
సాంకేతికవర్గం పనితీరు:
గబ్బర్ సింగ్‌లో హరీష్ శంకర్ చేసిన మ్యాజిక్ ఇక్కడ కనిపించదు. హరీష్ శంకర్ తన టెక్నికల్ టీంను బాగా వాడుకున్నాడు. మిక్కీ జే మేయర్ ఆర్ఆర్ తమన్ స్థాయిలో ఇచ్చాడు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ అది ఏ పీరియాడిక్ అని, ఏ టైం పీరియడ్ అని, ఆ క్యాస్టూమ్స్ ఏంటి? అని మాత్రం అడిగితే కష్టమే. అన్నీ కల్పితమే అని ముందే చెప్పాడు దర్శకుడు . ఇక అడగడానికి కూడా ఏమీ ఉండదు. కమిర్షియల్ సినిమాకు లెక్కలేంటి? అని అడిగితే కూడా కష్టమే. అయితే హరీష్ శంకర్ కొన్ని చోట్ల మంచి మాటలు రాస్తే.. ఇంకొన్ని చోట్ల దారుణమైన బూతులు వచ్చేలా పంచ్ డైలాగ్స్ రాసి వదిలేశాడు. ఆ తరువాత డైలాగ్స్ ఏంటో ప్రేక్షకుడికే వదిలేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి తగ్గించాల్సింది. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అభిషేక్ పాఠక్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
విశ్లేషణ:
రైడ్ సినిమాను చూడకుండా ఉంటే.. మిస్టర్ బచ్చన్ చూసి ఉంటే.. ఓ మోస్తరుగా నచ్చేస్తుంది. ఒక వేళ రైడ్ చూసి .. మిస్టర్ బచ్చన్ పొరబాటున చూస్తే మాత్రం అసహననానికి గురికావడం ఖాయం. రైడ్ సీరియస్‌గా సాగితే.. మిస్టర్ బచ్చన్ సిల్లీగా సాగుతుంది. నవ్వించాలని హరీష్ శంకర్ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలు అయినట్టుగా కనిపిస్తుంది. అన్నపూర్ణ ట్రాక్ క్రింజ్‌గా అనిపిస్తే.. సత్య ట్రాక్ ఏమో.. మిరపకాయ్‌లో సునీల్ ట్రాక్‌ను గుర్తుకు తెస్తుంటుంది. ఓవరాల్ గా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి. ఒక్క లైన్ లో చెప్పాలంటే... ఇది అవుట్ డేటెడ్ రీమేక్, స్క్రీన్ ప్లేగా అనిపిస్తుంది. ఇక ఇలాంటి చిత్రాలకు బీ, సీ సెంటర్లే కీలకం. లాజిక్‌లు ఎవడికి కావాలి.. సిల్లీ సీన్లు ఉంటే ఏంటి.. ఉన్నంత సేపు ఏదోలా ఎంటర్టైన్ చేశాడా? పాటలు, ఫైట్లు, పంచ్ డైలాగ్స్ ఉంటే సరిపోద్ది కదా? అని అనుకునే వాళ్లకి మిస్టర్ బచ్చన్ బాగానే వుంది కదా అనిపిస్తుంది.