‘నాటు నాటు’కు ఆస్కార్
95వ ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా నాటు నాటు నిలిచింది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు...’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. కీరవాణి స్వరపరచిన ఈపాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవపాడిన సంగతి తెలిసిందే. ప్రేమ్రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకుంటూ వేదికపై పాట పాడారు. ఆస్కార్ వేదికపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు సాంగ్ పాడారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్లో.. లాల్చీ, పంచకట్టులో కనిపించారు సింగర్స్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ ప్రకటించగానే డాల్బీ థియేటర్ కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఆస్కార్ అవార్డును అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆనందోత్సాహల్లో మునిగిపోయింది.