అమెరికాలో పూర్వ విద్యార్థుల ద్వైవార్షిక సదస్సును ప్రారంభించిన మంత్రి సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివి ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కొనియాడారు. గుంటూరు, రంగరాయ, సిద్థార్థ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల ద్వైవార్షిక సదస్సును అమెరికాలో ఫ్లోరిడాలో మంత్రి ప్రారంభించారు. అనంతరం సత్యకుమార్ మాట్లాడుతూ తాము చదువుకున్న విద్యా సంస్థల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. జింకాన ఆధ్వర్యంలో గుంటూరు సర్వజనాసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ లాల్ బహదూర్ నాగబైరు, జింకాన అధ్యక్షుడు లక్ష్మీ ప్రసాద్ వేముల పల్లి, పూర్వ అధ్యక్షుడు రవికుమార్ త్రిపురనేని, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, నాటో ఫార్మా ఉపాధ్యక్షుడు నన్నపనేని సదాశివరావు తదితరులు ఉన్నారు.