ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : గాడ్ ఫాదర్ లాంటి కథ తో 'మట్కా'  

రివ్యూ : గాడ్ ఫాదర్ లాంటి కథ తో 'మట్కా'  

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు  : వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్,
తారాగణం : వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు
సంగీతం: జివి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ : ఎ కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్, కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి, సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
విడుదల తేదీ : 14.11.2024

కథానాయకుడిగా వరుణ్ తేజ్ సినీ ప్రయాణం భిన్నమైంది. హిట్టూ ఫ్లాపులకు అతీతంగా డిఫరెంట్ కంటెంట్ వున్నా స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయినా సరే  సరైన విజయాలు లభించడం లేదు. సోలో హీరోగా లోగడ రెండు సినిమాలు 'గాంఢీవధారి అర్జున', 'ఆపరేషన్ వేలంటైన్' కూడా పరాజయం పొందాయి. మరి, పీరియాడికల్ సబ్జెక్టు తో ఈ రోజు విడుదలైన 'మట్కా' ఎలా ఉంది? ఈ సినిమా అయినా వరుణ్ తేజ్ కు విజయం అందిస్తుందా? లేదా? రివ్యూలో చూద్దాం.

కథ : 

స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ల తర్వాత అప్పటి బర్మా నుంచి విశాఖ వచ్చిన శరణార్థి వాసు  (వరుణ్ తేజ్)(Varun Tej)) తన చిన్న వయసులోనే తన తల్లితో వలస వస్తాడు. శరణార్థి శిబిరంలో ప్రసాద్ ('సత్యం' రాజేష్) (Satyam Rajesh)పరిచయం అవుతాడు. అక్కడ జరిగిన ఓ గొడవ వల్ల వాసు చిన్నతనంలో జైలుకు వెళతాడు. బయటకు వచ్చిన తర్వాత పూర్ణ  మార్కెట్టులోని కొబ్బరికాయల కొట్టులో అప్పల్ రెడ్డి (అజయ్ ఘోష్) దగ్గర పనికి చేరతాడు. అక్కడ లోకల్ గా పవర్ఫుల్ వ్యక్తులు కేబి (జాన్ విజయ్), అలాగే నాని (కిషోర్ కుమార్ జి) లు ఎలా తన లైఫ్ లోకి వస్తారు? వాసు మట్కా కింగ్ ఎలా అయ్యాడు? సుజాత (మీనాక్షి చౌదరి)(Meenakshi Choudary)తో ప్రేమలో ఎలా పడ్డాడు? వాసు ప్రయాణంలో ఎంపీ నాని బాబు (కిశోర్), సోఫియా (నోరా ఫతేహి) పాత్రలు ఏమిటి? వాసు మీద సీబీఐ కన్ను పడటానికి కారణం ఏమిటి? సాహు (నవీన్ చంద్ర) పట్టుకోగలిగాడా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా.

నటీనటుల హావభావాలు : 

ఈ సినిమాలో అన్ని నేనులు నేనే! అన్నట్టు వరుణ్ తేజ్ కోసమే ఈ సినిమా అని చెప్పాలి.  తన లోని వెర్సటాలిటీ కనిపిస్తుంది. మొత్తం మూడు షేడ్స్ లో వరుణ్ తేజ్ ప్రదర్శించిన నటన బాగుంది. మూడు షేడ్స్ కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్, మాటతీరు బాగున్నాయి. ఇంకా తన కూతురుతో సింగిల్ టేక్ సీన్ వరుణ్ మంచి ఎమోషన్స్ తో పండించాడు. అలాగే మీనాక్షి చౌదరి తన రోల్ లో సూటయ్యింది. ఇద్దరి నడుమ కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే ఇతర నటీనటులు నవీన్ చంద్ర, రవి శంకర్, సలోని తదితరులు డీసెంట్ పెర్ఫార్మన్స్ లు అందించారు. ఇక నెగిటివ్ షేడ్ లో కనిపించిన జాన్ విజయ్, కిషోర్ కుమార్ లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. ఇంకా స్పెషల్ అట్రాక్షన్ నోరా ఫతేహి సాంగ్ వరకు మాత్రమే కాకుండా సినిమాలో కీలక పాత్రలో కనిపించి కూడా మెప్పిస్తుంది.

సాంకేతిక వర్గం పనితీరు : 

దర్శకుడు కరుణ కుమార్. విషయానికి వస్తే.. తన మొదటి సినిమా పలాస తోనే మంచి విజయాన్ని సాధించి శ్రీ దేవి సోడా సెంటర్ తరువాత ఇపుడు మట్కా తో వచ్చారు. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు అలాగే ముఖ్యంగా వరుణ్ రోల్ ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. వీటితో పాటుగా అప్పటి డీటెయిలింగ్స్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. కానీ సినిమాని మాత్రం తను పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ గా నడిపించలేకపోయారు అని చెప్పక తప్పదు. కథనం వెళుతున్న కొద్దీ గ్రాఫ్ డౌన్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మధ్యలో కొన్ని కొన్ని చోట్ల సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ ని వరుణ్ తేజ్ తో పలికించిన కథలు, ఫిలాసపి బాగున్నాయి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమాలో డోస్ సరిపోలేదు అనిపిస్తుంది. వీటితో కథనాన్ని మరింత టైట్ గా ఫాస్ట్ పేస్ లో ఏమన్నా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. టెక్నికల్ వాల్యూస్ కనిపిస్తాయి.ఒకప్పుడు విశాఖని యూనిట్ చాలా సహజంగా కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఆ సెట్టింగ్స్ కానీ దర్శకుడు తీసుకున్న ప్రతీ డీటెయిల్ ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. ఖచ్చితంగా టెక్నికల్ పరంగా మట్కా ని పక్కాగా ప్లాన్ చేశారు. అలాగే జీవి ప్రకాష్ స్కోర్ బాగుంది. పాటలు కూడా పర్వాలేదు. ఏ కిశోర్ కుమార్ కెమెరా పనితనం సినిమా టోన్ కి తగ్గట్టుగా బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఫాస్ట్ పేస్ లో చేయాల్సింది. మేకర్స్ పెట్టిన ప్రతీ రూపాయి ఈ సినిమాలో కనిపిస్తుంది.

విశ్లేషణ : 

'మట్కా' (Matka Review) క్లైమాక్స్‌లో వాసు  ఓ డైలాగ్ చెబుతాడు... 'పాత సారా, కొత్త సీసా' అని తాను చేయబోయే కొత్త వ్యాపారం గురించి! సినిమా గురించి చెప్పడానికి సరిగ్గా ఆ డైలాగ్ సరిపోతుంది.పాత కథను కొత్తగా చూపడంలో   ఫెయిల్ అయ్యారు. 'మట్కా'లో మట్కా ఆట అనేది ఈ తరానికి తెలియక పోవొచ్చు సినిమాకు కొత్తది. ఆ కథ గానీ, కథలో పాత్రలు గానీ మన ప్రేక్షకులకు కొత్త కాదు. హీరో క్యారెక్టరైజేషన్ అంత కంటే కాదు. చేతిలో చిల్లిగవ్వ లేని హీరో కోట్లాది కోట్లకు అధిపతి కావడం, తన కనుసన్నల్లో నడిచే వేల కోట్ల నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం, ఈ ప్రయాణంలో తనకు అడ్డొచ్చిన  మోసం చేసిన వ్యక్తులను పైలోకాలకు పంపించడం... క్లుప్తంగా చెప్పాలంటే ఇదీ 'మట్కా' కథ. ఇంటర్వెల్ వరకు మట్కా ఆట మొదలు కాలేదు. అప్పటి వరకు వచ్చిన ఆ సీన్లు పలు పాత సినిమాలను తలపించాయి. సెకండాఫ్ సైతం ఎగ్జైట్ చేయదు. ఇటువంటి కథలు, సినిమాల్లో 'నాయకుడు' ' తరహాలో బలమైన భావోద్వేగాలు, పాత్రల మధ్య సంఘర్షణ ఉంటే తప్ప... సన్నివేశాలతో ప్రేక్షకులు ప్రయాణం చేయలేరు. అటు యాక్షన్, ఇటు ఎమోషన్ మధ్యలో ఏది ఎంచుకోవాలో తెలియక దర్శకుడు తడబడ్డారు. అవసరం అయితే 'మట్కా'లో కావాల్సినంత యాక్షన్ యాడ్ చేయొచ్చు. మొత్తంగా చూసినట్టు అయితే ఈ జూదపు డ్రామా “మట్కా” లో మరోసారి వరుణ్ తేజ్ తన సిన్సియర్ అటెంప్ట్ తో ఇంప్రెస్ చేస్తాడు. అలాగే సినిమాలో రోల్ మెప్పిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో సినిమా అంత ఎగ్జైటింగ్ గా ఆడియెన్స్ ని కట్టిపడేసే రేంజ్ లో అనిపించదు.  వీటితో మట్కా చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని సినిమాకెళ్తే మంచిది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :