అమెరికాలో గుమ్మడికాయ పడవతో.. గిన్నిస్ రికార్డు
అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్సేన్ భారీ గుమ్మడి కాయను పడవగా మార్చేసి, కొలంబియా నదిలో 26 గంటల్లో ఏకంగా 73.50 కిలోమీటర్లు ప్రయాణించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. గుమ్మడికాయ బోటులో అత్యంత దూరం ప్రయాణించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గత నెల 31న గిన్నిస్ రికార్డ్స్ బృందం ఆయనకు ప్రశంసపత్రాన్ని అందించింది. ఓరెగాన్‌లోని హ్యాపీ వ్యాలీకి చెందిన గ్యారీ 2011 నుంచి గుమ్మడికాయలు సాగు చేస్తున్నాడు. తొలిసారిగా 2013లో ఓ పెద్ద గుమ్మడి కాయను బోటులా తయారు చేసి, వెస్ట్ కోస్ట్ జెయింట్ పంప్కిన్ రెగట్టా పోటీల్లో పాల్గొని విజయం సాధించాడు. అప్పటి నుంచి ఆయనకు అదో అలవాటుగా మారింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎలాగైనా స్థానం సంపాదించాలన్న ఉద్దేశంతో తన వ్యవసాయ క్షేత్రంలో 1224 పౌండ్ల ( సుమారు 555.2 కేజీలు) గుమ్మడికాయను పండించాడు. అక్టోబరు 5న గిన్నిస్ రికార్డ్స్ సభ్యుల పర్యవేక్షణలో దాని బరువును లెక్కించాడు. దానిని లోపలి గుజ్జును తీసేసి, ఓ పడవలా తయారు చేశారు. అక్టోబరు 12న ఉత్తర బాన్విల్లిలోని కొలంబియా నదీ తీరానికి చేరుకొని ఏకధాటిగా 26 గంటలపాటు 73.50 కి.మీ ప్రయాణించి కెనడాలోని వాంకోవర్ ఒడ్డుకు చేరుకుని రికార్డు నెలకొల్పాడు.