అలాంటి ఆలోచన కాంగ్రెస్ నేతలకు ఎప్పుడైనా వచ్చిందా? : మంత్రి కేటీఆర్

అన్నదాతలను ముప్పుతిప్పలు పెట్టేందుకే కాంగ్రెస్ పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామంటోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పట్వారీ వ్యవస్థ కావాలా? ధరణి కావాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌నే రైతన్నకు భరోస అని తెలిపారు. ధరణి ఎత్తేస్తే దళారుల రాజ్యం వస్తుందన్నారు. 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ సన్న బియ్యం ఇస్తాం. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3 వేలు ఇస్తాం. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం.ధరణిలో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిచేస్తాం అని తెలిపారు.
ఈ పదేళ్ల కాలంలో తెలంగాణను ఎలా మార్చుకున్నామో ప్రజలు గమనించాలి. తెలంగాణ రాష్ట్రం ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది. ఇదంతా సాధ్యం అయిందంటే మన నాయకుడు కేసీఆర్‌యే కారణం. రైతులకు పెట్టుబడి సాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ నేతలకు ఎప్పుడైనా వచ్చిందా? రైతు బిడ్డ, రైతుల కష్టం తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం పండగలా మారింది. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వేలపుట్ల ధాన్యం పండుతోంది. కరెంట్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి అని అన్నారు.






