డిసెంబరు 3 తర్వాత సీఎం కేసీఆర్.. శుభవార్త

మంచిగా నడిచే ప్రభుత్వాన్ని ప్రగతిలో దూసుకెళ్తోన్న రాష్ట్రాన్ని ఎవరు పడితే వారి చేతుల్లో పెడదామా? ప్రజలు ఆలోచించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా ఖానాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వస్తున్నారని, వారందరి అజెండా ఒక్కటేనన్నారు. ఎలాగైనా కేసీఆర్ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 46 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ హాయంలో కేవలం 29 లక్షల మందికి మాత్రమే పింఛన్లు వచ్చేవి.
రాష్ట్రంలోని ఆడబిడ్డలకు మేనమామలా కేసీఆర్ అండగా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో సర్కారు దవాఖానాకు వెళ్లను బాబోయ్ అని అనేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వెళ్తే ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్తామని ప్రజలు అంటున్నారు. నీరు, కరెంటుతో పాటు అనేక సమస్యలు పరిష్కరించిన బీఆర్‌ఎస్, మాకేం చేస్తుందని తెలంగాణ ఆడబిడ్డలు అడుగుతున్నారు. అత్తలకు పింఛన్లు వస్తున్నాయి. మరి మా సంగతి ఏంటని కోడళ్లు ప్రశ్నిస్తున్నారు. అందుకే డిసెంబర్ 3 తర్వాత కోడళ్లకు కేసీఆర్ శుభవార్త చెబుతారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరి కోసం కొత్త పథకాన్ని అమలు చేస్తాం. దాని పేరు సౌభాగ్య లక్ష్మీ. నెలకు రూ.3 వేలు మీఖాతాల్లో వేస్తాం. ఖానాపూర్‌లో మీరు వేసే ఓటు జాన్సన్‌కు కాదు, కేసీఆర్‌కు వేస్తున్నట్లే భావించాలి అని కేటీఆర్ కోరారు.






