కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో సీబీఐ, ఈడీ వడివడిగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఈస్కామ్ లో కీలకసూత్రధారి సిసోడియా అని కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. అయితే ఇప్పుడు ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గామారడంతో.. ఇది ఎక్కడకు దారితీస్తుందా అన్న చర్చలు ఊపందుకున్నాయి. మరీ ముఖ్యంగా ఈకేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఇటీవలి కర్నాటక ఎన్నికల్లో పరాజయం తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోతూవస్తోంది. దీంతో హైకమాండ్ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలంటే కవితను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందని ఇప్పటికే .. తెలంగాణలోని పలువురు బీజేపీనేతలు హైకమాండ్ కు విన్నవించినట్లు తెలుస్తోంది.ఇప్పుడు పక్కా సాక్ష్యాలతో కవితను అరెస్ట్ చేస్తే,.. ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు గట్టిదెబ్బ తగిలినట్లు అవుతుందని.. ఫలితంగా బీజేపీకి ప్రజల్లో ఓటుశాతం పెరుగుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే ఈరాజకీయ పోరాటంలో జగన్ ను.. బీజేపీ హైకమాండ్ ఆయుధంగా వాడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనక.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంప్రదింపులు ఉన్నాయని సమాచారం. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఒక్కరాష్ట్రం.. కర్నాటక చేయి జారిపోయింది. దీంతో తెలంగాణలో గెలుపు అత్యవసరంగా బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.కవిత అరెస్టుతో బీఆర్ఎస్ నేతల్లో ధైర్యాన్ని దెబ్బకొట్టడం ద్వారా.. పార్టీ నుంచి చేరికలను ప్రోత్సహించి, బీజేపీ బలోపేతానికి కృషి చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కవిత ఆడిటర్ బుచ్చిబాబు ఇప్పటికే అప్రూవర్ గా మారారు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అవుతున్నారు. ఈపరిస్థితుల్లో కవితకు ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు కవిత అరెస్టు అయితే.. దాన్ని బీజేపీ ప్రధానాస్త్రంగా సంధించి, ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎటుపోయి ఎటువస్తుందా అన్న టెన్షన్ గులాబీ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టు అయితే.. ఢిల్లీలో పాగా వేసేందుకు అడ్డంకులు ఉండవని కమలనాథులు భావిస్తున్నారు. సో వన్ షాట్ ఎట్ టు బర్డ్స్ అన్నమాట.