ASBL Koncept Ambience
facebook whatsapp X

బీఆర్ఎస్ మళ్లీ ఆంధ్రా – తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తోందా..?

బీఆర్ఎస్ మళ్లీ ఆంధ్రా – తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తోందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటింది. ఈ పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఇబ్బందులేవీ లేవనే చెప్పొచ్చు. విడిపోయినా తెలుగు వాళ్లంతా కలిసి ఉండాలనే నినాదంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తూ వచ్చాయి. పార్టీల మధ్య విభేదాలున్నా అవి ప్రజల వరకూ రాకుండా జాగ్రత్త పడ్డాయి. అయితే తెలంగాణ సెంటిమెంట్ పైనే ఆవిర్భవించిన బీఆర్ఎస్.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. ఆంధ్రా నేతలతో తప్ప ప్రజలతో తమకు ఎలాంటి విభేదాలూ లేవని ఆ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రావాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంది.

పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకుంటోంది. నాడు కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేసేందుకు ప్రయత్నించిన కేసీఆర్ బాటలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి పయనిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఓ వైపు తమ ప్రజాప్రతినిధులను కాపాడుకుంటూనే.. మరోవైపు పార్టీని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకో బీఆర్ఎస్ మరోసారి ఆంధ్రా – తెలంగాణ సెంటిమెంటును రాజేసే ప్రయత్నం చేస్తోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం కలిగిస్తున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఉద్దేశించి.. ఆంధ్రా నుంచి ఇక్కడికొచ్చి పెత్తనాలు చేస్తావా.. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తాం అంటూ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ మాటలు విన్నవాళ్లంతా బీఆర్ఎస్ మళ్లీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తోందని భావిస్తున్నారు. ఇవి వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ అయినా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి పార్టీ వ్యాఖ్యలుగానే భావించాల్సి ఉంటుందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కామెంట్స్ పై కేసీఆర్, కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేసింది.

గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎదురైన ప్రతిసారి సెంటిమెంట్ రగిల్చి లబ్ది పొందుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఆ పంథానే ఫాలో అవుతోందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రోళ్లంతా ఆ పార్టీకి అండగా నిలిచారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కు ఎదురుగాలి వీచినా ఆంధ్రోళ్లు అధికంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 సీట్లు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ గెలవడానికి ఆంధ్రాప్రాంత వాసులే కారణమనేది నిజం. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఆంధ్రోళ్లపై నోరు పారేసుకోవడం బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :