కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' కి హైకోర్టులో ఎదురుదెబ్బ
కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ కి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్స్ సర్టిఫికేషన్‌ను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. అయితే, సెప్టెంబర్ 18వ తేదీలోపు ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. తదుపరి విచారణను 19వ తేదీ నాటికి వాయిదా వేసింది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎమర్జెన్సీ. కంగనా రనౌత్ కథానాయిక. ఆమె స్వీయ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. చిత్రంలో తమని తక్కువగా చూపించారని, విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని సంప్రదించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది.