అమెరికాలో రికార్డు స్థాయిలో ..భారతీయ విద్యార్థులు
ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 2022-23 విద్యా సంవత్సరంలో 35 శాతానికి పైగా పెరిగింది. మునుపెన్నడూ లేని రీతిలో 2,68,923 మంది విద్యార్థులు మన దేశం నుంచి అమెరికాకు వెళ్లారని, అన్ని దేశాల నుంచి వచ్చిన 10 లక్షల మందిలో మనవాళ్లే 26 శాతం ఉన్నారని ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది. 2022-23 విద్యా సంవత్సరానికి అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12 శాతం పెరిగింది. గత 40ఏళ్లలో ఇదే గరిష్టం.
అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో చైనాది అగ్రస్థానం. 2022-23 లో ఆ దేశం నుంచి 2.90 లక్షల మంది వెళ్లారు. తర్వాత స్థానం భారత్‌ది. ఈ రెండు దేశాల నుంచే 53 శాతం మంది ఉంటున్నారు. అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 2009`10 తర్వాత తొలిసారిగా చైనాను భారత్ అధిగమించిందని నివేదిక తెలిపింది. భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 63శాతం పెరిగి 1,65,936కి చేరుకున్నారు. భారత్ నుంచి ఏటా విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనా నుంచి గత మూడేళ్లుగా కొంత తగ్గుతోంది. ఈ రెండింటి తర్వాత దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్, నైజీరియా ఉంటున్నాయి.