Radha Spaces ASBL

అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ అమెరికన్‌లు

అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ అమెరికన్‌లు

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్‌లు సత్తా చాటారు. రాజకీయాల్లో కూడా భారత సంతతి మూలాలు ఉన్న పలువురు ఈ ఎన్నికల్లో ప్రతినిధుల సభకు, వివిధ రాష్ట్రాల చట్ట సభలకు ఎన్నికై తమ హవాను చాటారు. ఈసారి రికార్డు స్థాయిలో ప్రతినిధుల సభకు ఐదుగురు ఎన్నికయ్యారు. 33.19 కోట్ల అమెరికన్‌ జనాభాలో భారత సంతతి పౌరుల సంఖ్య కేవలం ఒక శాతం మాత్రమే. అయినా అగ్రరాజ్యంలో కీలక బాధ్యతల్లోకి దూసుకెళ్లడంలో ముందంజలో ఉంటున్నారు.

అధికార డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఐదుగురు భారతీయ అమెరికన్‌లు ప్రతినిధుల సభకు (హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌) ఎన్నికయ్యారు. రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీబెరా, ప్రమీలా జయపాల్‌లు, ఇండియన్‌-అమెరికన్‌ వ్యాపారవేత్త తానేదార్‌ మిషిగాన్‌ నుంచి ఎన్నికయ్యారు. 

రాష్ట్రాల చట్టసభలకు ఎన్నికైనవారిలో అరవింద్‌ వెంకట్‌, తారిక్‌ ఖాన్‌ (పెన్సిల్వేనియా) సల్మాన్‌ భోజని, సులేమాన్‌ లలానీ (టెక్సాస్‌), శాంసింగ్‌, రంజీవ్‌ పురి (మిషిగాన్‌), నబీలా సయ్యద్‌, మేగన్‌ శ్రీనివాస్‌, కవిన్‌ ఒలిక్కల్‌ (ఇల్లినాయీ), నబ్లియా ఇస్లాం, ఫరూక్‌ ముఘల్‌ (జార్జియా), కుమార్‌ భర్వే (మేరీలాండ్‌), అనితా సమాని (ఒహాయో) తదితరులు ఉన్నారు. కౌంటీ జడ్జిలుగా, కమిషనర్లుగా మరికొందరు భారతీయ అమెరికన్లు విజయం సాధించారు.

* జిల్లా 11 నుండి ఒహియో ప్రతినిధుల సభకు అనితా సోమాని (డెమొక్రాట్‌) ఎన్నికయ్యారు. రిపబ్లికన్‌ ప్రత్యర్థి ఒమర్‌ తరాజీపై 44 శాతంతో ఆమె 59 శాతానికి పైగా ఓట్లతో గెలుపొందారు.

* అరవింద్‌ వెంకట్‌, స్టేట్‌ హౌస్‌, పెన్సిల్వేనియా, రిపబ్లికన్‌ ప్రత్యర్థిని ఓడిరచి 55.2 శాతం ఓట్లతో విజయాన్ని అందుకున్నారు.
* పెన్సిల్వేనియాలోని స్టేట్‌ హౌస్‌కు డిస్ట్రిక్ట్‌ 194 నుంచి పోటీ చేసిన తారిక్‌ ఖాన్‌ 90.8 శాతం ఓట్లతో గెలిచారు.
* ఫరూక్‌ ముచల్‌, స్టేట్‌ హౌస్‌, జార్జియా, 51.8 శాతం ఓట్లతో డిస్ట్రిక్ట్‌ 105 నుండి విజయం సాధించారు.
* జెరెమీ కూనీ న్యూయార్క్‌ స్టేట్‌ సెనేట్‌లో డిస్ట్రిక్ట్‌ 56లో 54 శాతం ఓట్లతో తన సీటును తిరిగి గెలుచుకున్నారు.
* న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ వుమన్‌ జెనిఫర్‌ రాజ్‌కుమార్‌ డిస్ట్రిక్ట్‌ 38 నుండి తన స్థానాన్ని నిలుపుకున్నారు.
* 1991లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయ-అమెరికన్‌లలో కుమార్‌ బార్వే, ముగ్గురు సభ్యుల స్లేట్‌లో భాగంగా మేరీల్యాండ్‌లోని ప్రతినిధుల సభకు మళ్లీ ఎన్నికయ్యారు.
* జిల్లా 15 నుండి నార్త్‌ కరోలినా స్టేట్‌ సెనేటర్‌ అయిన జే చౌధర్‌ 1, రిపబ్లికన్‌ ప్రత్యర్థిని 67.3 శాతం ఓట్లతో ఓడిరచి తన సీటును తిరిగి గెలుచుకున్నారు.
* మేగన్‌ శ్రీనివాస్‌ జిల్లా 30 నుండి 63 శాతం కంటే ఎక్కువ ఓట్లతో అయోవాలోని స్టేట్‌ హౌస్‌కు ఎన్నికయ్యారు.
* అరిజోనాలోని జిల్లా 18 నుండి రాష్ట్ర సెనేట్‌ అయిన ప్రియా సుందరేశన్‌ 54 శాతం కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు.
* టెక్సాస్‌లోని స్టేట్‌ హౌస్‌కు డిస్ట్రిక్ట్‌ 92 నుండి పోటీ చేసిన సల్మాన్‌ భోజాని 58 శాతం ఓట్లతో విజయం సాధించారు.
* మిచిగాన్‌ స్టేట్‌ హౌస్‌ మాజీ సభ్యుడు సామ్‌ సింగ్‌, డిస్ట్రిక్ట్‌ 28 నుండి స్టేట్‌ సెనేట్‌కు పోటీ చేసి 55.7 శాతం ఓట్లతో విజయం అందుకున్నారు.
* జార్జియాలోని స్టేట్‌ హౌస్‌కు డిస్ట్రిక్ట్‌ 8 నుండి పోటీ చేసిన బంగ్లాదేశ్‌-అమెరికన్‌ నబిలా ఇస్లాం 52.8 శాతం ఓట్లతో గెలుపొందారు.
* డిస్ట్రిక్ట్‌ 76 నుండి టెక్సాస్‌లోని స్టేట్‌ హౌస్‌కు అభ్యర్థి సులేమాన్‌ లాలానీ 57 శాతం కంటే ఎక్కువ ఓట్లతో విజయాన్ని అందుకున్నారు.
* జిల్లా 51 నుండి ఇల్లినాయిస్‌లోని స్టేట్‌ హౌస్‌ అభ్యర్థి నబీలా సయ్యద్‌ గెలిచారు.
* మరోవైపు టెక్సాస్‌ నుంచి పోటీచేసిన సందీప్‌ శ్రీవాస్తవ ఓటమి పాలయ్యారు. మాజీ కోలిన్‌ కౌంటీ న్యాయమూర్తి కీత్‌ సెల్స్‌ చేతిలో పరాజయం పొందారు.

అరుణ మిల్లర్‌కు తెలుగు సంఘాల నాయకులు అభినందనలు

అమెరికా రాజకీయాల్లో మేరీ ల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణ మిల్లర్‌ ఎన్నికై చరిత్ర సృష్టించడం పట్ల అమెరికాలోని పలు తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశాయి.   అమెరికాలోని తెలుగు సంఘాల నాయకులు అరుణ కాట్రగడ్డపై ప్రశంసలు కురిపించారు. మేరీ ల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణ మిల్లర్‌ గెలుపొందడం తెలుగు వారందరికీ గర్వకారణమని తానా సంఘం ప్రెసిడెంట్‌ అంజయ్య చౌదరి లావు అన్నారు. మా అందరికీ ఆమె ఆత్మీయురాలని, ఆమె మరిన్ని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

అరుణ మిల్లర్‌ తెలుగువారికి ఎల్లప్పుడూ అండగా ఉండేవారని ఆటా ప్రెసిడెంట్‌ భువనేశ్వర్‌ బుజాల కొనియాడారు. ఆమె లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వంటి ఉన్నత స్థాయి పదవి చేపట్టడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆటా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.

మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎన్నికైన అరుణ మిల్లర్‌ తెలుగు మహిళ కావడం ఆనందదాయకంగా ఉందని టీటీఏ సంఘం అధ్యక్షుడు మోహన్‌ పాటలోళ్ళ అన్నారు. భారత్‌లో ఎంతో మందికి ఆమె స్ఫూర్తిదాయకమని, మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

అరుణ మిల్లర్‌ ఎన్నిక పట్ల నాట్స్‌ ప్రెసిడెంట్‌ బాపయ్య చౌదరి నూతి శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ నుంచి వలస వచ్చి అమెరికా రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్లడం అభినందనీయమన్నారు. అమెరికాలో జన్మించిన భారతీయులకు అరుణ స్పూర్తిదాయకమన్నారు.

వేటా వ్యవస్థాపక అధ్యక్షురాలు రaాన్సీ రెడ్డి కూడా అరుణ ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేశారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తెలుగు మహిళ అరుణా మిల్లర్‌ (58) చరిత్ర సృష్టించారు. మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కావడం ఇదే మొదటిసారి. అరుణకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడిరది. అరుణ విజయంతో ఆమె స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో ఆమెబంధువులు సంబరాలు చేసుకున్నారు.

ఈ ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున మేరీల్యాండ్‌ గవర్నర్‌, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పదవులకు పోటీచేసిన వెస్‌ మూర్‌, అరుణా మిల్లర్‌ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులపై సునాయాసంగా విజయం సాధించారు.  ప్రస్తుతం 58వ పడిలో ఉన్న అరుణా మిల్లర్‌ హైదరాబాద్‌లో జన్మించారు. అరుణకు ఏడేండ్ల వయసున్నప్పుడు (1972లో) ఆమె కుటుంబం అమెరికాకు వలసవెళ్లి అక్కడే స్థిరపడిరది. మేరీల్యాండ్‌లో అరుణకు విస్తృత ప్రజాదరణ ఉన్నది. ఆమెకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మేరీల్యాండ్‌లో విస్తృత ప్రచారం చేయడంతోపాటు పలువురు రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులు సైతం అరుణకు అనుకూలంగా పనిచేయడంతో సునాయాసంగా విజయం సాధించినట్టు తెలుస్తున్నది.

అమెరికన్‌ రాష్ట్రాల్లో గవర్నర్‌ తరువాత అత్యున్నత పదవికి అరుణ మిల్లర్‌ ఎన్నిక కావడంపై హర్షం వ్యక్తమవుతోంది. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌. గవర్నర్‌ ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు విధులను లెఫ్ట్‌నెంట్‌ గవర్నరు నిర్వర్తిస్తారు. అలాగే గవర్నర్‌ రాజీనామా చేసినా, పదవి నుంచి తొలగింపునకు గురైనా, మరణించినా... ఆ పదవిని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ చేపడతారు.

‘‘నేను దాదాపు ఇరవయ్యేళ్ళ నుంచి ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నాను. నా కుటుంబం ఇక్కడే విస్తరించింది. నా పిల్లలు ఇక్కడి పబ్లిక్‌ స్కూళ్ళలోనే చదివారు. ఈ ప్రాంతంలో సమస్యలూ, ప్రజల సాధకబాధకాలూ నాకు బాగా తెలుసు. అలాగే నా కెరీర్‌లో ఎక్కువకాలం ప్రభుత్వోద్యోగిగా ఇక్కడే పని చేశాను. నేను ఉద్యోగిని అయిన తల్లిని. పిల్లల పెంపకం, వయోధికులైన తల్లితండ్రుల సంరక్షణ... వాటితో వృత్తి బాధ్యతలను బ్యాలెన్స్‌ చేసుకోవడం నాకు బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ నివసిస్తున్న సగటు ప్రజలకు నేను భిన్నమైనదాన్ని కాదు. అటువంటి ప్రజలకు అనుకూలంగా ఉండే విధానాలను ప్రవేశపెట్టి, అమలు చేయడానికి నా అధికార హోదాను వినియోగించుకుంటాను. అలాగే ఈ ప్రాంతంలో ఉద్యోగం, మౌలిక సదుపాయాలు, పౌర రవాణా, ట్రాఫిక్‌ లాంటి వివిధ సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిమీదా నాకు అవగాహన ఉంది’’ అని వివిధ సందర్భాల్లో అరుణ మిల్లర్‌ పేర్కొన్నారు. ఆమెకు మీనా, ఛోలే, సాషా అనే ముగ్గురు అమ్మాయిలు. ‘‘పిల్లల సంరక్షణ, ఉద్యోగ బాధ్యతలు... అటు వృత్తినీ, ఇటు ఇంటినీ నిర్వహించుకుంటూ రావడం పెద్ద సవాలు. ఆ కష్టమేమిటో నాకు తెలుసు. ఈ విషయంలో నా కుటుంబం నుంచి నాకు గట్టి మద్దతు దొరికింది. ఇంట్లో ఒక పురుషుడు మాత్రమే ఉద్యోగం చేసే తరం కాదు మనది. ఇరవయ్యొకటో శతాబ్దంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే కానీ గడవని పరిస్థితి. కార్మిక విధానాలను దీనికి అనుగుణంగా మార్చాలి. తల్లితండ్రులు ఇద్దరికీ జీతంతో కూడిన పేరెంటల్‌ లీవ్‌ ఇవ్వాలి, పిల్లలకు అత్యుత్తమ వైద్య సంరక్షణ అందేలా చూడాలి. అలాగే నాణ్యమైన విద్య వారికి లభించేందుకు చర్యలు తీసుకోవాలి. వీటికే నా ప్రాధాన్యం’’ అని చెబుతారామె. ‘‘ఈ దేశం నాకు అనేక అవకాశాలు ఇచ్చింది. తిరిగి ఇవ్వడానికి ప్రజా సేవకన్నా గొప్ప మార్గమేదీ కనిపించలేదు. నాకన్నా ముందు ఈ దేశానికి వచ్చిన ఎందరో వ్యక్తులు ప్రజాస్వామ్యం కోసం, అందరికీ సమాన హక్కుల కోసం పోరాటం చేశారు. వారికి నా ధన్యవాదాలు. అమెరికాలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి నిరంతరం ఉత్తేజం పొందుతూనే ఉన్నాను’’ అంటున్న అరుణ... ‘‘ప్రతి ఒక్కరికీ ప్రతిఫలాలు అందడానికి అవిశ్రాంతంగా పోరాటం చేస్తాను. ఏ ఒక్కరూ వెనుకబాటుతనంతో లేని ప్రదేశంగా మేరీల్యాండ్‌ను రూపుదిద్దాలనే ఒక అంకితభావంతో ఆ ప్రమాణం మొదలవుతుంది’’ అని తన గెలుపు అనంతరం స్పష్టం చేశారు.

నబీలా సయ్యద్‌

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నబీలా సయ్యద్‌ చరిత్ర  సృష్టించారు. 23 ఏళ్లకే ఇల్లినాయిస్‌ రాష్ట్ర చట్ట సభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు. రిపబ్లిక్‌ పార్టీకి చెందిన క్రిస్‌ బోస్‌పై ఆమె గెలుపొందారు.  ఇల్లినాయిస్‌ 51వ డిస్ట్రిక్‌ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 52.30శాతం ఓట్లు రావడం విశేషం. ఈ సందర్భంగా నబీలా తన ఆనందాన్ని తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. నా పేరు నబీలా సయ్యద్‌. నాకు 23 ఏళ్లు. భారతీయ అమెరికన్‌ ముస్లిం మహిళను. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిపై గెలిచాను. ఇల్లినాయిస్‌ జనరల్‌ అసెంబ్లీకి ఎన్నికైన అతి చిన్న వయస్కురాలిని అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో తన విజయం రహస్యం ప్రజలతో మమేకమవ్వడమేనని చెప్పారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నానని తెలిసిన తర్వాత ప్రజలతో మాట్లాడేందుకే ఎక్కువ సమయం కేటాయించానని నబీలా సయీద్‌ తెలిపారు. ఈ పోటీలో ఎందుకు పాల్గొంటున్నానో వివరించానని తెలిపారు. మెరుగైన నాయకత్వం కోసం సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమవ్వడం వల్లే విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు. తనకు వెన్నంటి ఉంటూ మద్దతిచ్చిన ప్రతిఒక్కరికి సామాజిక మాధ్యమాల వేదికగా నబీలా సయ్యద్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ జిల్లాలో ప్రతి ఒక్కరి తలుపు తట్టినట్లు చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల మరొకసారి వారిని కలుస్తానని తెలిపారు.

చరిత్ర సృష్టించిన జస్మీత్‌ కౌర్‌ బెయిన్స్‌ ఎన్నిక...

కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన సిక్కు మహిళ డాక్టర్‌ జస్మీత్‌ కౌర్‌ బెయిన్స్‌  ఎన్నికై చరిత్ర సృష్టించారు. బేకర్స్‌ఫీల్డ్‌కు చెందిన జస్మీత్‌ కౌర్‌ కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికై  ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి సిక్కు మహిళగా రికార్డుకెక్కారు. కెర్న్‌ కౌంటీలోని 35వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్‌ నుంచి బరిలోకి దిగిన జస్మీత్‌ కౌర్‌ తన ప్రత్యర్థి లెటిసియా పెరెజ్‌పై విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె బేకర్స్‌ఫీల్డ్‌ రికవరీ సర్వీసెస్‌లో మెడికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వ్యసనానికి బానిసలైన వారికి ఈ సంస్థ చికిత్స, సేవను అందిస్తుంది. ఇక తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరోగ్య సంరక్షణ, నీటి సదుపాయాలు, గాలి నాణ్యతకు తొలి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అటు జస్మీత్‌ కౌర్‌ కరోనా విపత్కర సమయంలో చేసిన సేవలు కూడా ఆమె ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి కొంతమేర సహాయం చేసింది. జస్మీత్‌ కౌర్‌ పేరెంట్స్‌ కొన్నేళ్ల క్రితం ఇండియా నుంచి యూఎస్‌ వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆటోమెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆమె తండ్రికి కార్ల డీలర్‌షిప్‌లు ఉన్నాయి. కళాశాల విద్య పూర్తైన తర్వాత డాక్టర్‌ కావడానికి ముందు ఆమె తన తండ్రితో కలిసి వ్యాపారం చూసుకు న్నారు. కోవిడ్‌-19 ఉద్ధృతంగా ఉన్నప్పుడు రోగులకు సేవ చేసేందుకు ఫీల్డ్‌ హాస్పిటల్‌ సైట్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా జస్మీత్‌ కౌర్‌ అక్కడి స్థానికుల మన్ననలు పొందారు. 

డెమోక్రటిక్‌ అభ్యర్థుల విజయం

మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లను డెమోక్రాట్లు ఎదుర్కొన్న తీరుపై అమెరికా అధ్యక్షుడు  బైడెన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, ఎంపిక చేసుకొనే హక్కును కాపాడుకోవాలని అమెరికా ప్రజలు ఈ ఎన్నికల్లో స్పష్టమైన సందేశం ఇచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి రోజు అని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు డెమోక్రాట్లకు భారీగా నష్టం కలుగుతుందని చాలా మంది అంచనాలు వేశారని.. చివరకు తన ఆశావాదమే నెగ్గిందని చెప్పారు. ఈ సందర్భంగా 2024 అధ్యక్ష పదవి రేసులో కొనసాగుతానన్న సంకేతాన్ని బైడెన్‌ ఇచ్చారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పట్ల వ్యతిరేకత ఉన్నా మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ఓటర్లు డెమోక్రాటిక్‌ పార్టీ పట్ల సానుకూలత ప్రకటించడం గమనార్హం. రిపబ్లికన్లకు పట్టున్న కీలక స్థానాల్లోనూ డెమోక్రాటిక్‌ అభ్యర్థులను గెలిపించారు. బైడెన్‌ పట్ల వ్యతిరేకత, ద్రవ్యోల్బణం, అబార్షన్‌పై సుప్రీం కోర్టు తీర్పు తమకు మేలు చేస్తాయని భావించిన రిపబ్లికన్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కలేదు.  పాలనాపరంగా అమెరికాలో ఈ మధ్యంతర ఎన్నికలు చాలా కీలకం. అధ్యక్షుడి పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :