చైనాపై ఆధారపడకుండా.. భారత్, అమెరికా మరో 12 దేశాల మధ్య
భారత్ వంటి దేశాలు చైనాపై ఆధారపడకుండా వీలు కల్పించేలా ఒక ఒప్పందం జరిగింది. భారత్, అమెరికాతో పాటు మరో 12 ఐపీఈఎఫ్‌కు చెందిన సభ్య దేశాలు ఒక సరఫరా వ్యవస్థ బలోపేత ఒప్పందంపై సంతకాలు చేయడమే ఇందుకు కారణం. సరఫరా వ్యవస్థలో అనిశ్చితులు ఎదురైనప్పుడు, కీలక రంగాల్లో ఉన్న ఉత్పత్తి కేంద్రాలను సురక్షిత దేశాలకు తరలించడానికి ఈ ఒప్పందం కీలు కల్పిస్తుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పరిటీ (ఐపీఈఎఫ్) మినిస్టీరియల్ సమావేశానికి హాజరైన వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ భారత్ తరపు సంతకం చేశారు.
కరోనా పరిణామాల సమయంలో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఔషధ ముడి పదార్థాల వంటి వివిధ ఉత్పత్తుల కోసం పలు దేశాలు చైనాపైనే ఆధారపడాల్సి వచ్చింది. తాజా ఒప్పందం వల్ల చైనాపై ఆధారపడడం తగ్గడంతో పాటు, సరఫరా వ్యవస్థ వికేంద్రీకరణ కావడం, సులభతరంగా పెట్టుబడుల సేకరణ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ మరింత బలంగా మారడానికి వీలవుతుంది. భారతీయ ఉత్పత్తులకు అనువైన వాతావరణమూ ఏర్పడుతుంది.