Radha Spaces ASBL

బ్లాక్‌ ఫంగస్ ఎలా వస్తోంది?

బ్లాక్‌ ఫంగస్ ఎలా వస్తోంది?

కరోనా నుంచి కోలుకున్నామన్న సంతోషం లేదు. అసలు కోవిడే సోకలేదన్న ఆనందం అంతకన్నా ఉండటం లేదు. కొత్తగా పడగ విప్పిన ఫంగస్‌లు జనాన్ని వణికించేస్తున్నాయి. కరోనా సోకి తగ్గిన వారిపై బ్లాక్‌ ఫంగస్‌ ఎటాక్‌ చేస్తుంటే.. కరోనా సోకని వారిలోనూ ప్రవేశిస్తే భయపెడుతోంది వైట్‌ ఫంగస్‌. ఇప్పుడు ఈ రెండు ఫంగస్‌లు చాప కింద నీరులా దేశమంతా విస్తరిస్తున్నాయి. కరోనా ఎంట్రీ ఇచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కట్టడి చర్యలను పట్టించుకోకపోవడంతో అది విజృంభించింది.

భారత్‌పై బ్లాక్‌ ఫంగస్‌ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 9 వేలకు చేరువైంది. నిన్నటి వరకు 8వేల 848 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా గుజరాత్‌, మహారాష్ట్ర.. బ్లాక్‌ ఫంగస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 2000 మందికి పైగా బ్లాక్‌ ఫంగస్‌ సోకగా.. అందులో 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక గుజరాత్‌లో 2281 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో 9వందలకు పైగా, తెలంగాణలో 5వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం బ్లాక్‌ ఫంగస్‌ కట్టడికి కోసం.. ఆయా రాష్ట్రాల్లోని కేసుల ఆధారంగా యాంఫో టెరిసిన్ -బి వయల్స్‌ను కేటాయించింది. ఇటు వైట్‌ ఫంగస్‌ కేసులు బయటపడటం కూడా ఆందోళన కలిగిస్తోంది.

బ్లాక్‌ ఫంగస్‌ ఎంట్రీతో దీనిపై అధ్యయనం ప్రారంభించారు నిపుణులు. దీని లక్షణాలు, కారణాలను వివరిస్తున్నారు. ఒకసారి వాడిన మాస్కులనే సరిగా శుభ్రం చేయకుండా మళ్లీ, మళ్లీ వాడటం.. గాలి, వెలుతురు సరిగా లేని గదుల్లో ఉండటం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడిన చాలా మంది రోగులను పరిశీలించిన తరువాత.. వీరు చాలా కాలం పాటు మాస్కులును ఉతకకుండా, శుభ్రం చేయకుండా ధరించడం, గాలి, వెలుతురు సరిగా లేని గదుల్లో ఉన్నవారేనని తేలిందని ఢిల్లీ వైద్య నిపుణులు వెల్లడించారు.

మరోవైపు విచ్చలవిడిగా స్టెరాయిడ్ల వాడకం వల్ల కూడా బ్లాక్ ఫంగస్ వచ్చేందుకు కారణంగా చెబుతున్నారు వైద్య నిపుణులు. వైద్యుల సూచన లేకుండానే స్టెరాయిడ్లు వాడటం, ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన వారు అపరిశుభ్ర మాస్కులను వాడటం వల్ల కూడా ఈ వ్యాధి ప్రబలుతున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌ల్లో వాడే కుళాయి నీళ్ల వల్ల ఊపిరితిత్తుల్లోకి ఈ ఫంగస్‌ చొరబడుతున్నట్టు తెలుసుకున్నారు. దీన్ని నివారించేందుకు తగిన సూచనలు చేస్తున్నారు.

ప్రతిరోజు మాస్కులను డిస్‌ ఇన్‌ఫెక్ట్‌ చేసుకోవాలని.. గాలి, వెలుతురు సరిగా ఉన్న గదుల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. అలాగే చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు ఉపయోగించేవారు తరుచుగా హ్యూమిడిఫయర్లను శుభ్రపరుచుకోవాలని.. లేదా తరుచూ వాటిని మార్చుకోవాలని సూచిస్తున్నారు. స్టెరాయిడ్లు తీసుకునే వారు క్రమం తప్పకుండా షుగర్‌ టెస్టులు చేయించుకోవాలని చెబుతున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :