సరికొత్త చరిత్ర...

పార్లమెంటు నూతన భవనం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఆంగ్లేయుల నుంచి భారతీయులకు జరిగిన అధికార మార్పిడికి గుర్తుగా లార్డ్ మౌంట్‌బాటన్ నుంచి జవహర్‌లాల్ నెహ్రూ అందుకున్న రాజదండం -సెంగోల్‌ను లోక్‌సభలో ప్రతిష్ఠించనున్నారు. ఇది అయిదు అడుగులకు పైగా పొడవు, పైభాగంలో నంది చిహ్నంతో, బంగారుపూత కలిగిన వెండి దండం. పార్లమెంటు నూతన భవన ప్రారంభంతో పాటు రాజదండం ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28న నిర్వహించనున్నారు.
పరిపాలనలో నీతి, న్యాయం, కర్తవ్యపథంలో సాగాలన్న సందేశాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దీనిని లోక్‌సభలో ప్రతిష్టిస్తున్నారు. ఈ అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని ప్రతిపక్షాలకు అమిత్‌షా సూచించారు. పురాతన సంప్రదాయాలతో నవభారతాన్ని జోడించడానికి చేస్తున్న ప్రక్రియగా చూడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో ఉన్న సెంగోల్‌ను తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనం నుంచి వచ్చే వేదపండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించనున్నట్లు ప్రకటించారు.
అంతకు ముందు వరకూ ఈ రాజదండం గుజరాత్‌లోని అలహాబాద్ మ్యూజియంలో ఉండేది. గతేడాది నవంబరు 4న అక్కడ నుంచి శాశ్వత ప్రాతిపదికన దిల్లీ జాతీయ మ్యూజియానికి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజదండ ప్రతిష్ఠాపన అనే మహత్తర ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆ దండాన్నే తమిళంలో సెంగోల్ అంటారు. సెంగోల్ అంటే సంపద నుంచి సంపన్నం అని. దీని మూలాలు దేశ వారసత్వ పరంపరతో ముడిపడి ఉన్నాయి.
సెంగోల్.. అధికార మార్పిడికి సంబంధించిన అంశం. దీన్ని పాత పార్లమెంటు భవనం నుంచి కొత్తపార్లమెంటు భవనానికి పాలన ప్రక్రియ మారుతుండడంతో.. ఈ సెంగోల్‌ను లోక్‌సభలో ప్రతిష్టించనున్నారు. అభివృద్ధి పథంలో సాగుతున్న దేశానికి దశ, దిశా నిర్దేశించే క్రమంలో.. ఈ మహత్తర ఘట్టానికి పూనుకున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.