బాంక్వెట్ విందుతో జిడబ్ల్యుటీసిఎస్ గోల్డెన్ జూబ్లి వేడుకలు ప్రారంభం
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జిడబ్ల్యుటీసిఎస్) గోల్డెన్ జూబ్లి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. లీస్ బర్గ్‌లోని ద్రోమవల్ల ఫామ్ 14980లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా, అతిధుల కోలాహలం మధ్య ప్రెసిడెంట్ కృష్ణ లాం ఆధ్వర్యంలో, ముఖ్య అతిధుల సమక్షంలో ప్రారంభించారు. రెండు రోజుల స్వర్ణోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం వర్జీనియాలోని లీస్‌బర్గ్‌లో బ్యాంక్వెట్ విందుతో తొలిరోజు కార్యక్రమం ప్రారంభమయింది. అతిధులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ప్రముఖ సాహితీవేత్త జొన్నవిత్తుల, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఎమ్మెల్యేలు, సినీ కళాకారులు తదితరులు పాల్గొన్నారు. తానా నాయకులు, ఎన్నారై టీడిపి నాయకులు జయరాం కోమటి, సతీష్ వేమన తదితరులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
జిడబ్ల్యుటీసిఎస్ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అధ్యక్షుడు లాం కృష్ణ మాట్లాడుతూ సంస్థ ఏర్పడి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు తన హయాంలో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ వేడుకలకు ఇంతమంది వచ్చి విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు. వేడుకలకు ముందు నిర్వహించిన వివిధ పోటీలను కూడా అందరూ విజయవంతం చేశారన్నారు. బ్యాంక్వెట్ విందులో భాగంగా పలువురు ప్రవాసులకు, తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రవాస ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. డోనర్లను సత్కరించారు. మయూరి రెస్టారెంట్ ఆధ్వర్యంలో వచ్చిన అతిధులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. శివతాండవం, నాట్య ప్రదర్శనలు అలరించాయి. అనిరుధ్ సుస్వరం, అమలచేబోలు సంగీత కచ్చేరి ఆకట్టుకుంది.