భాషా వైభవానికి, సాహిత్య శోభకు వేదికగా నిలిచిన GWTCS స్వర్ణోత్సవ వేడుకలు : కృష్ణ లాం
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకలు వేడుకలు కన్నులపండువగా, అంగరంగ వైభవంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన పలు రంగాల ప్రముఖులతోపాటు తానా, ఇతర ప్రవాస సంఘాల నాయకులు, పలు రంగాల ప్రముఖులతో ఈ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
కార్యవర్గ, పలు విభాగాల సభ్యుల శ్రమ, దాతల ఔదార్యం, పెద్దల, పూర్వాధ్యక్షుల సూచనలతోనే ఇంత ఘనంగా నిర్వహించగలిగామని అధ్యక్షులు కృష్ణ లాం తెలిపారు. రెండురోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో మొదటి రోజు సెప్టెంబర్ 27 బాన్క్యూట్, సెప్టెంబర్ 28 ముఖ్య కార్యక్రమాన్ని జరిపారు. జిడబ్ల్యుటీసిఎస్ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుక ప్రారంభమైంది.
భాష, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనంగా జరిగిన ఈ కార్యక్రమంలో శివతాండవం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. సినీ నటుడు అలీ ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. చేశారు. అధ్యక్షుడు లాం కృష్ణ మాట్లాడుతూ సంస్థ ఏర్పడి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లి వేడుకలను ముందుండి నిర్వహించటం తనకు సంతోషంగా ఉందన్నారు..వేలాది మంది తెలుగు వారు విచ్చేసి విజయవంతం చేయడం తన జీవితంలో మరపురాని ఘట్టంగా ఈ వేడుక నిలిచిపోతుందన్నారు.
జిడబ్ల్యుటీసిఎస్ ఆరంభం నుండి భాషకు పెద్ద పీట వేస్తూ భావితరాలకు తెలుగు భాషను చేరువ చేసే లక్ష్యంగా ఎంచుకుని పనిచేస్తూ, సంక్రాంతి, ఉగాది, దీపావళి వంటి వేడుకల్లో ప్రముఖ కళాకారులను ఆహ్వానించి ఈ పరంపరను ముందు తరాలకు అందిస్తున్నామన్నారు.
యువతను ప్రోత్సహిస్తూ.. జిడబ్ల్యుటీసిఎస్ నిర్వహించిన సాంస్కృతిక, నృత్య , క్రికెట్, సింగింగ్, డ్యాన్సింగ్ పోటీలతోపాటు తెలుగు బాల వైభవం , సాహిత్య రచన పోటీలను నిర్వహించి బహుమతులు అందించింది. చిన్న పిల్లల నుంచి పెద్దలదాకా ఎంతో మంది ఈ పోటీలకు హాజరై విజయవంతం చేశారు. ఈ పోటీల్లో కూడా వందలాది మంది క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేశారు. వందలాది టెస్లా కార్లతో నిర్వహించిన జిడబ్ల్యుటీసిఎస్ డ్యాన్స్ షోకి స్పందన విశేషం.
ప్రతిభకు పట్టం కడుతూ .. మొదటి రోజు.. పలువురు ప్రవాసులకు, తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రవాస ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. విభిన్న రంగాల్లో అశేష ప్రతిభ కనబరిచిన వారికి బిజినెస్ ఎక్సలెన్స్ పురస్కారాలను అందించారు. శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ (జిడబ్ల్యుటిసిఎస్ అధ్యక్ష పురస్కారం), శ్రీమతి సాయికాంత రాపర్ల (జిడబ్ల్యుటీసిఎస్ సేవ), శ్రీమతి కల్పనా తమ్మినేని (వైద్య రంగం), శ్రీ అనిల్ పాటిబండ్ల (బిజినెస్), శ్రీ అంజన్ చిమలదిన్నె (రాజకీయం) శ్రీ అశ్విన్ పుప్పాల (యూత్ బిజినెస్), శ్రీ గౌతమ్ అమర్నేని (ఐటీ) , శ్రీ చిన్న బాబు గుడపాటి (ఎంట్రప్రెన్యూరర్), శ్రీ నాగ్ నెల్లూరి (ప్రైమరీ విద్య) , శ్రీమతి జయప్రద వల్లూరుపల్లి (మహిళ), శ్రీ రవి వెనిగళ్ల (సామాజిక సేవ), శ్రీమతి జయశ్రీ గంప (ఉమెన్ ఎంట్రప్రెన్యూరర్), శ్రీ మధుసూధన్ రెడ్డి కాశిపతి (దేశ సేవ),శ్రీ వాసుబాబు గోరంట్ల (రూరల్ ఎడ్యుకేషన్, ఎంపవర్‌మెంట్), శ్రీ వేణు నక్షత్రం (సాహిత్య రంగం), శ్రీమతి సంధ్య బైరెడ్డి (కళలు). శ్రీ సంతోష్ రెడ్డి సోమి రెడ్డి (న్యాయ). శ్రీ శ్రీధర్ చిల్లర (మీడియా), శ్రీ శ్రీనివాస్ చావలి (రియల్ ఎస్టేట్), శ్రీ శ్రీనివాస్ వెంపటి (వ్యవసాయ రంగం), శ్రీమతి తనూజ గుడిసేవ (తెలుగు సాహిత్య ప్రోత్సాహం) లకు అవార్డులను ప్రకటించి అందించారు.
రెండవరోజున ఉదయం శ్రీ శ్రీనివాస కళ్యాణంతో కార్యక్రమాలను ప్రారంభించారు. తెలుగు కవి జొన్నవిత్తుల 2019 తానా సభల స్వాగత నృత్యానికి రాసిన ‘‘ఆంధ్ర భారతం’’ నృత్య రూపకాన్ని స్థానిక ప్రవాస చిన్నారులు, యువతీ యువకులు అద్భుతంగా ప్రదర్శించారు. భారతీయం గొట్టిపాటి సత్యవాణి చేతులమీదుగా సావనీర్‌ను ఆవిష్కరించారు. రంగస్థల సామ్రాట్ గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో నన్నయ్యపై ప్రదర్శించిన నాటకం నభూతో అన్న రీతిలో ప్రదర్శించారు.. మధ్యాహ్న కార్యక్రమాల్లో భాగంగా ‘‘2047 నాటికి తెలుగు భాష’’ అనే అంశంపై కవి జొన్నవిత్తుల, అవధాని పాలపర్తి శ్యామలానందప్రసాద్‌లు ప్రసంగించారు. పలు మాండలీకాలు, యాసలు, ఉచ్ఛారణ రకాలను అధ్యయనం చేయాలని సూచించారు. చివరిగా స్వర బ్రహ్మ మణిశర్మ సంగీత విభావరి వేలాది మందిని ఉర్రుతలూగించింది..
జీవన సాఫల్య గ్రహీత ఆంధ్ర రాష్ట్ర శాసన సభాపతి శ్రీ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఇది తనకు మరిచిపోలేని అనుభవమని.. మాతృభూమికి దూరంగా ఉంటున్నా మాతృభూమికి, మాతృభాషకూ ఎన్నారైలు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. అమెరికాలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ సంక్షేమంకోసం వారు ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారని, సహాయ సహకారాలతో కూడా ముందుంటారని ప్రశంసించారు. అధ్యక్షుడు కృష్ణ లాం, కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో తానా అగ్ర నాయకులు, ఎన్నారై టీడిపి నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. స్థానిక పెద్దలు డా. మూల్పూరి వెంకటరావు, జక్కంపూడి సుబ్బారాయుడు, కోమటి జయరాం, నాదెళ్ల గంగాధర్, వేమన సతీష్, ప్రదీప్ గౌర్నేని, త్రిలోక్ కంతేటి, సత్యనారాయణ మన్నె, సాయిసుధ పాలడుగు, ఇసి కమిటీ సభ్యులు, బోర్డ్ డైరెక్టర్లు, కమిటీ చైర్ పర్సన్‌లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.