జిడబ్ల్యుటీసిఎస్ వేడుకల్లో ఆకట్టుకున్న ‘‘ఆంధ్ర భారతం’’
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా రెండవరోజు కూడా వివిధ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. లీస్ బర్గ్‌లోని ద్రోమవల్ల ఫామ్ 14980లో జరిగిన ఈ వేడుకలకు ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ నాయకులు, సినిమా కళాకారులు, సాహితీవేత్తలు, ఇతర రంగాల ప్రముఖుల రాకతో ఈ వేడుకలు సందడిగా కనిపించాయి. స్వర్ణోత్సవాల్లో భాగంగా రెండోరోజు కార్యక్రమాలు తెలుగువైభవాన్ని చాటిచెప్పేలా సాగాయి. ఉదయం శ్రీవేంకటేశ్వర కళ్యాణంతో కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం జిడబ్ల్యుటీసిఎస్ కార్యవర్గ సభ్యులు వేదిక వద్దకు చేరుకుని జ్యోతి వెలిగించి, గణపతి ప్రార్థనతో వేడుకలు ప్రారంభించారు.
ప్రముఖ కవి జొన్నవిత్తుల 2019 తానా సభల స్వాగత నృత్యానికి రాసిన ‘‘ఆంధ్ర భారతం’’ నృత్య రూపకాన్ని స్థానిక ప్రవాస చిన్నారులు, యువతీ యువకులు అద్భుతంగా ప్రదర్శించారు. అధ్యక్షుడు లాం కృష్ణ నేతృత్వంలోని కార్యవర్గ సభ్యులు జొన్నవిత్తులను ఘనంగా సత్కరించారు. గొట్టిపాటి సత్యవాణి చేతులమీదుగా సావనీర్‌ను ఆవిష్కరించారు. గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో నన్నయ్యపై ప్రదర్శించిన నాటకం రక్తికట్టించింది.మధ్యాహ్న కార్యక్రమాల్లో భాగంగా ‘‘2047 నాటికి తెలుగు భాష’’ అనే అంశంపై కవి జొన్నవిత్తుల, అవధాని పాలపర్తి శ్యామలానందప్రసాద్‌లు ప్రసంగించారు.
50ఏళ్ల కిందట తెలుగు పదాలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆంగ్ల పదాల మాదిరిగానే, నేడు కూడా కొత్త కొత్త ఆంగ్లపదాలు దైనందిన జీవితంలోకి రావడం సాధారణమే అయినప్పటికీ, పలు మాండలీకాలు, యాసలు, ఉచ్ఛారణ రకాలను అధ్యయనం చేయాలని సూచించారు. టీవీలో వార్తలు కూడా పలు ప్రాంతాల యాసల్లో చదివితే ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పలు భాషా యాసల పట్ల అవగాహన, ఆసక్తి పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు. తెలుగు భాష మాట్లాడేవారు ఉన్నంత వరకు, దానికి ఏ విధమైన ఢోకా ఉండదని పేర్కొన్నారు. రాత్రి మణిశర్మ సంగీత విభావరి వైభవంగా జరిగింది.