అలరించిన తానా విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం ‘‘తానా ప్రపంచసాహిత్యవేదిక’’ ఆధ్వర్యంలో ‘‘నెల నెలా తెలుగు వెలుగు’’ (ప్రతి నెలా ఆఖరి ఆదివారం)లో భాగంగా ఆదివారం, నవంబర్ 27న జరిగిన 42వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం అతి వైభవంగా జరిగింది.‘‘అవధాన విద్వన్మణి’’ డా. బులుసు అపర్ణ అవధానిగా ఒక్కొక్క ఖండంనుండి ఒక మహిళా సాహితీవేత్త పృచ్చకురాలిగా పాల్గొన్న ఈ ‘‘విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం’’ ప్రపంచంలోనే తొలి మహిళా అష్టావధానం గా తెలుగు సాహిత్యచరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది.
తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తన స్వాగతోపన్యాసంలో ఈ నాటి ఈ సాహిత్య సభ వినూత్నము, విశిష్టమైనదని అతిథులందరకూ ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘నెల నెలా తెలుగు వెలుగు’’ పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం ఎన్నో వైవిధ్య భరితమైన సాహిత్య అంశాలతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న తానా ప్రపంచసాహిత్య వేదిక మీద ఈ నాటి డా. బులుసు అపర్ణగారి అష్టావధానం తెలుగు సాహిత్యలోకంలో ఒక మహత్తరఘట్టం అని అభివర్ణించారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహాకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ భారత దేశంనుండి మహిళా అవధాని, ప్రతి ఖండం నుండి పృచ్చకులు అందరూ మహిళలే పాల్గొన్న ఈ ‘‘విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం’’ తెలుగు సాహిత్యచరిత్రలో మొదటిసారి అని, తానా సంస్థ సాహిత్య కిరీటంలో యిదొక కలికి తురాయి అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తూ, ఇప్పటికే వివిధ నగరాలలో 5 శతావధానాలు, 200 కు పైగా అష్టావధానాలతో ఎంతోమంది సాహితీప్రియుల విశేష అభిమానాన్ని సంపాదించుకున్న అవధాని డా. బులుసు అపర్ణను మరియు వివిధ దేశాలనుండి పాల్గొన్న పృచ్చకురాండ్రకు తానా ప్రపంచసాహిత్యవేదిక తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ డా. తోటకూర అతిథులందరనూ క్లుప్తంగా పరిచయం చేశారు.
ఈ అవధాన సంధానకర్తగా ఉత్తర అమెరికా ఖండం, అమెరికా, చికాగో నుండి డా. శారదాపూర్ణ శొంఠీ వేదమంత్రాలతో సభను ప్రారంభించి, ప్రతిభావంతంగా సభను సమన్వయం చేశారు.
పృచ్చకురాండ్రుగా -: సరోజ కొమరవోలు, ఉత్తరఅమెరికా ఖండం, కెనడా దేశంనుండి ‘‘ఆశువు’’ రాధిక మంగిపూడి, ఆసియా ఖండం, సింగపూర్ దేశంనుండి `‘‘నిషిద్ధాక్షరి’’అరవిందా రావు, ఐరోపా ఖండం, ఇంగ్లాండ్ దేశంనుండి ‘‘దత్తపది’’ డా. శ్రీదేవి శ్రీకాంత్, దక్షిణాఫ్రికా ఖండం, బోట్స్వానా దేశం నుండి ‘‘అప్రస్తుత ప్రసంగం’’ ఉమ దేశభొట్ల, దక్షిణ అమెరికా ఖండం, గయానా దేశం నుండి ‘‘వర్ణన’’ డా. నాగలక్ష్మి తంగిరాల, ఆస్ట్రేలియా ఖండం, న్యూజిలాండ్ దేశం నుండ ‘‘వ్యస్తాక్షరి’’ డా. నిడమర్తి నిర్మలాదేవి, ఉత్తర అమెరికా ఖండం, అమెరికా దేశం, సియాటిల్ నుండి ‘‘సమస్య’’ శారద రావి, ఆసియా ఖండం, సౌదీ అరేబియా దేశం నుండ ‘‘వార గణనం’’ అనే అంశాలలో పాల్గొన్నారు.
ఆద్యంతం ఛలోక్తులతో రసవత్తరంగా అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో జరిగిన ఈ ‘‘విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం’’లో అవధాని డా. బులుసు అపర్ణకు తానా ప్రపంచ సాహిత్య వేదిక సాహిత్యాభిమానులందరి తరపున ‘‘అవధాన సరస్వతి’’ అనే బిరుదును ప్రదానం చేశారు. అవధాని డా. బులుసు అపర్ణ తన ముగింపు సందేశంలో అనేక దశాబ్దాల చరిత్ర కలిగిన తానా లాంటి విశ్వవేదిక మీద అష్టావధానం చేయడం తన అదృష్టమని, ఈ అవకాశం కల్పించిన తానా సంస్థకు, పృచ్చకులకు, సాహితీప్రియులకు, ప్రసారమాధ్యమాలకు పత్యేక కృతజ్ఞతలు తెలిపారు.