ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సినీ ఇండస్ట్రీకి జగన్ గుడ్ న్యూస్

సినీ ఇండస్ట్రీకి జగన్ గుడ్ న్యూస్

కరోనా వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోయింది. కరోనా దెబ్బకు ప్రభావం చూపని రంగమంటూ లేదు. దాదాపు అన్ని వ్యవస్థలా కరోనా దాటికి కుదేలైపోయాయి. దీంతో అన్ని సంస్థలూ తీవ్ర ఆర్థిక నష్టాలు చూస్తున్నాయి. అయితే లాక్ డౌన్ తొలగించిన తర్వాత ఇప్పుడిప్పుడే కొన్ని రంగాలు మళ్లీ పురోగమన బాటలో నడుస్తున్నాయి. సినిమా రంగం కూడా ఇంతే. తెలుగు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీ ఎంతో పెద్దది. బాలీవుడ్ తర్వాత దేశంలో అతి పెద్ద సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్డే. అయితే కరోనా దెబ్బకు టాలీవుడ్ కూడా తీవ్ర సంక్షోభం చవిచూసింది. అందుకే తమను ఆదుకోవాలంటూ టాలీవుడ్ పెద్దలు తెలుగు రాష్ట్రాలను కోరారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరోనా వల్ల దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ లు బంద్ అయ్యాయి. థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. చాలా మంది సినీ కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ లేదు. షూటింగ్ లు మళ్లీ మొదలయ్యాయి. థియేటర్లు తెరుచుకున్నాయి. ఇప్పుడిప్పుడే ఉపాధి మొదలైంది. అయితే కేసులు భారీగా పెరుగుతుండడంతో మళ్లీ సంక్షోభంలోకి వెళ్తుందేమోనన్న ఆందోళన మొదలైంది. మళ్లీ థియేటర్లను ఎక్కడ క్లోజ్ చేస్తారోననే భయం పుట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ సినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ చెప్పింది. చిత్ర పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా థియేటర్లు, మల్టీప్లేక్సుల 2020 ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు విద్యుత్‌ స్థిర చార్జీల చెల్లింపులను రద్దు చేయడంతో పాటు.. తదుపరి ఆరు నెలల కాలానికి చెందిన స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పించింది. థియేటర్లు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ వెసులుబాటును.. ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే వడ్డీ రాయితీ వెసులుబాటు మల్టీప్లెక్సులకు లేదని చెప్పింది.

ఇది చిత్ర పరిశ్రమకు ఎంతో ఊరట కల్పిస్తుంది. లాక్ డౌన్ కాలంలో థియేటర్లన్నీ మూతపడ్డాయి. అయినా ఆ కాలానికి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. అప్పటికే తీవ్ర నష్టాలు చవిచూసిన తమకు ఇది గుదిబండగా మారుతోందని.. దీనిపై సమీక్షించాలని థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వాలను కోరాయి. అందుకే లాక్ డౌన్ కాలానికి విద్యుత్ బిల్లులను రద్దు చేయడంతో పాటు మిగిలిన ఆరు నెలల కాలానికి వాయిదాల్లో చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వ నిర్ణయంపై థియేటర్ల యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో  చిత్ర పరిశ్రమ, అనుబంధ వ్యవస్థల్లో ఆధారపడిన కార్మికులకు లబ్ధిచేకూర్చేందుకు ఉత్తర్వలు జారీ మెగాస్టార్‌ చిరంజీవి సీఎం జగన్‌కు ట్వీటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సినీ ఇండస్ట్రీకి జగన్ ప్రభుత్వ నిర్ణయం ఎంతో దోహదపడుతుందన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :