అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయుల దుర్మరణం
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నం.75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, మరొకరు తమిళనాడు వాసి. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్ టోన్‌విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారని తెలిపారు. వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడిరచారు. డల్లాస్‌లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఈ కారులో ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వీరి మృతిపై స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.