ఏయూ పూర్వ విద్యార్థికి అరుదైన గౌరవం... అమెరికాలో
ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) పూర్వ విద్యార్థికి అరుదైన అవకాశం దక్కింది. అమెరికాలో స్థిరపడిన వయార్టిస్ సంస్థ గ్లోబల్ క్యాలిటీ ఇన్వెస్టిగేషన్ హెడ్ డాక్టర్ దేవ పురాణం ఇటీవల అమెరికా అధ్యక్షుడు నివాసం ఉండే వైట్‌హౌస్‌లో నిర్వహించిన 2 కార్యక్రమాల్లో పాల్గొనే అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అమెరికాలోని హెల్త్‌కేర్ రంగంలో వ్యయాన్ని తగ్గించే అంశంపై చర్చించడానికి దేశ వ్యాప్తంగా స్వల్ప సంఖ్యలో నిపుణులను ఆహ్వానించగా అందులో దేవ పురాణం ఒకరు. అలాగే, ది నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్, ది నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ప్రదానోత్సవంలో సైతం ఆయన ప్రత్యేక అహ్వానితులుగా పాల్గొన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లతో కరచాలనం చేసి కొద్దిసేపు మాట్లాడారు. ఇటువంటి అరుదైన ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో భాగమైన దేవపురాణంని ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఏయూలో కెమిస్ట్రీ, ఫార్మాసీ విభాగాల్లో ఉన్నత విద్యను, పీహెచ్‌డీని దేవపురాణం పూర్తి చేశారు. తన ఉన్నతికి కారణమైన ఏయూ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల ఫార్మసీ కళాశాల విద్యార్థినుల హాస్టల్ భవనానికి తన తల్లిదండ్రులు లలితా దేవి, కోటిలింగాల మూర్తిల పేరు మీద రూ.50 లక్షలు విరాళమిచ్చారు.