ఇక కమలాతో నో డిబేట్..
డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తో మరో డిబేట్‌కు సిద్ధంగా లేనని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డెమొక్రాట్ల రాడికల్ లెఫ్ట్ అభ్యర్థి కమలాతో జరిగిన డిబేట్ లో తానే గెలిచానని.. అయితే సర్వేలు మొత్తంగా భిన్నంగా చూపిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మూడో చర్చకు సిద్ధంగా లేను అంటూ అందులో రాసుకొచ్చారు.
తొలి డిబేట్‌లో ఓడిపోయిన వాళ్లే మళ్లీ చర్చకు సిద్ధమవుతారని కమలా హారిస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు..ఈ చర్చ జరిగిన 24 గంటల్లో కమలాకు 47 మిలియన్ల డాలర్ల విరాళాలు వచ్చాయి. అధ్యక్ష రేసులోంచి జో బైడెన్ వైదొలగకముందు ట్రంప్, బైడెన్‌ల మధ్య తొలి డిబేట్ జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రేసులోకి వచ్చారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ – కమలా మధ్య తొలి డిబేట్ జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా జరిగిన మొదటి ముఖాముఖిలో ఇద్దరూ పాల్గొన్నారు. వాడీవేడిగా సాగిన ఈ డిబేట్‌లో పరస్పర విమర్శల దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ ముఖాముఖి చర్చలో కమలా హారిస్‌దే పైచేయి అని అమెరికా మీడియా మొత్తం తేల్చింది. అయితే, అందుకు ట్రంప్ అంగీకరించట్లేదు. అక్టోబర్ 1న డెమొక్రాట్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి టిమ్ వాజ్, ట్రంప్ రన్నింగ్ మేట్ జేడీవాన్స్ మధ్య చర్చ జరగనుంది. ఈచర్చలో ఎవరు పైచేయి సాధిస్తారు..? వారి విధానాలు ఎలా ఉండనున్నాయి. లాంటి అంశాలపైనా అమెరికన్లు గట్టిగానే ఫోకస్ పెట్టారు.
కాగా, నవంబర్ 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమాక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ పై ఉన్న రెండు నేరాభియోగాలను కోర్టు కొట్టివేసింది.2020 ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నారన్న అభియోగాలను జార్జియాకు చెందిన ఫాల్టన్ కౌంటి న్యాయమూర్తి తోసిపుచ్చారు.ట్రంప్ పై ఉన్న ఎనిమిది అభియోగాలతో పాటు ఇతర కేసుల విచారణకు అనుమతించారు.