హైడ్రా ఉండాల్సిందే.. రేవంత్ సూపరంటున్న పవన్ కల్యాణ్..
చెరువులను చెరపట్టిన అక్రమ కట్టడాల తుప్పు వదిలిస్తోంది హైడ్రా. వీఐపీలు లేదా అధికారులు లేదు.. ఎవరి భవనమైనా అక్రమకట్టడమని తేలితే చాలు నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది.హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పేరు చెబితే చాలు ఇప్పుడు అక్రమకట్టడాల ఓనర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు..రాష్ట్రవ్యాప్తంగా చెరువులను ఆక్రమణల చెర నుంచి విడిపిస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం.. హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇప్పుడు అక్రమ కట్టడాల పనిపడుతోంది.. హైదరాబాద్‌లో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఒక స్వతంత్ర సంస్థగా ఇది ఏర్పాటు చేశారు.. దీనికి కమిషనర్ గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను కూలుస్తూ దూకుడు చూపిస్తోంది హైడ్రా.. ఈ హైడ్రా.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నేతలను ఆకర్షిస్తోంది. తమ రాష్ట్రంలో ఇలాంటి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ..ఆయారాష్ట్రాల నేతలు భావించేస్థాయికి చేరింది హైడ్రా...
లేటెస్టుగా హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. హైడ్రా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అన్నారు.. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్..ఏపీలో ఉన్న పరిస్థితుల్లో హైడ్రా లాంటి వ్యవస్థపై ఏం చేయాలి అనేది చర్చిస్తాం అన్నారు పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌లో చెరువుల్లో ఇల్లు కట్టేస్తున్న సమయంలో చూసే వాడిని.. ఇళ్లు చెరువుల్లో కట్టేస్తే ఎలా అనుకునే వాడిని.. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వాటిని తొలగిస్తున్నారు అని అభినందించారు..
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగే సమయంలో కఠినంగా ఉండాలని.. అలా కాకుండా కట్టే సమయంలో సైలెంట్ గా ఉంటే ఇబ్బందులు తప్పవన్నారు.. ఇక, ఇళ్ల నిర్మాణాలు చేసే సమయంలో.. వెంచర్లు వేసే సమయంలో.. వీటిని అడ్డుకోవాలి.. పలుకుబడితో ఇలాంటి నిర్మాణాలు చేపడితే.. దాచుకున్న డబ్బుతో ఇళ్లను కొన్న వారికి వాటిని తొలగిస్తే నష్టం జరుగుతందన్నారు.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందే ఈ ఆక్రమణలను, అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే 10 ఏళ్ల తర్వాతైనా మళ్లీ ప్రజలకు ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..