Radha Spaces ASBL

టాలీవుడ్ పై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. వాయిదాలు తప్పవా..?

టాలీవుడ్ పై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. వాయిదాలు తప్పవా..?

కరోనా ప్రభావం సమాజంపైన ఏ స్థాయిలో ఉందో గతేడాది మనం కళ్లారా చూశాం. ఇప్పుడు గతేడాదిని మించి కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష 31వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫస్ట్ వేవ్ లో కూడా ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఈ సంఖ్య మరో నాలుగైదు వారాల్లో మరింత పీక్ స్టేజ్ కు వెళ్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి నిర్బంధ పరిస్థితులు తప్పవేమోననిపిస్తోంది. అయితే లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. అయినా కరోనాను ఎలా కట్టడి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు కరోనా ప్రభావం టాలీవుడ్ పై మరోసారి పడుతోంది. దీంతో నిర్మాతలు, థియేటర్ల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు.

లాక్ డౌన్ ప్రభావం నుంచి టాలీవుడ్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. గతేడాది సినీ రంగం పూర్తిగా పడకేసింది. అప్పుడు షూటింగులు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. అవన్నీ ఇప్పుడు తెరుచుకున్నాయి. షూటింగులు మొదలయ్యాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు రిలీజయ్యాయి. థియేటర్లు కూడా ఫుల్ ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయ్యాయి. దీంతో సినిమాలను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టారు. మరో ఆరు నెలలకు సరిపడా థియేటర్లను బుక్ చేసుకుని రిలీజ్ డేట్స్ ప్రకటించేశారు. కానీ ఇంతలోనే కరోనా సెకండ్ వేవ్ మళ్లీ పంజా విసురుతోంది. 

కరోనా సెకండ్ వేవ్ దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందో అంతుచిక్కట్లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో కరోనా భయం మొదలైంది. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీశారు. వరుసపెట్టి సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సెకండ్ వేవ్ ప్రభావం మొదలు కావడంతో థియేటర్లు ఇలాగే కంటిన్యూ అవుతాయా.. లేదా అనేది సందిగ్ధంగా మారింది. ఒకవేళ థియేటర్లు తెరిచే ఉన్నా.. జనాలు సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తారా.. అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రొడ్యూసర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే గిట్టుబాటు కాదనుకున్న నిర్మాతలు తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచౌతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమానా వాయిదా వేసుకుంటున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ నెల 16న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్నందువల్లే వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించింది సినిమా యూనిట్. ఇలాంటి సినిమాలు అనేకం ఉన్నాయి. త్వరలోనే ఇవి కూడా వాయిదాల బాట పడుతాయనే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు షూటింగులపైన కూడా కరోనా ఎఫెక్ట్ పడనుంది. ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మళ్లీ ఫుల్ స్పీడ్ అందుకున్నాయి. దీంతో కార్మికులకు ఉపాధి దొరుకుతోంది. వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేసేయాలనే ఉద్దేశంతో రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అయితే షూటింగులకు కూడా మళ్లీ బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. అంతుచిక్కని విధంగా కరోనా విస్తరిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లకు సైతం కరోనా సోకుతోంది. దీంతో ఏం చేయాలో నిర్మాతలకు పాలుపోవట్లేదు. మళ్లీ లాక్ డౌన్ విధించడం, థియేటర్లు మూతపడడం, షూటింగులు నిలిపేయడం లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇండస్ట్రీ కోలుకోవడం చాలా కష్టం అని సినిమా పెద్దలు చెప్తున్నారు. మరి సెకెండ్ వేవ్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది వేచి చూడాలి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :