అలరించిన సీసీఎల్ బాంకెట్ వేడుకలు

అలరించిన సీసీఎల్ బాంకెట్ వేడుకలు

అమెరికాలో కమ్యూనిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) వార్షిక బాంకెట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. లానియర్ టెక్ సెంటర్‌లో జరిగిన ఈ బాంకెట్‌కు 400 మందికిపైగా ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాగ వాహిని బాలీవుడ్ పాటలు, ప్యూర్ హార్ట్స్ ఆఫ్ జీఏకు చెందిన దివ్యాంగ చిన్నారుల నృత్య ప్రదర్శనలతో ఈ వేడుకలు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత స్థానిక డ్యాన్స్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. అనంతరం సీసీఎల్ వ్యవస్థాపకులు ఈ సంస్థ చరిత్ర నుంచి, స్థాపన గురించి వివరించారు. అలాగే అతిథులు, స్పాన్సర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీసీఎల్ అధ్యక్షులు శ్రీని దివ్వెల మాట్లాడుతూ.. 2022 లీగ్ గురించి వివరించారు. ఎగ్జిక్యూటివ్ బృందం చేసిన కృషిని కొనియాడారు. అలాగే ‘గివింగ్ బ్యాక్ టు కమ్యూనిటీ’లో భాగంగా ‘ప్యూర్ హార్ట్స్ ఆఫ్ జీఏ’ సంస్థకు విరాళాలు ప్రకటించారు. ఈ బాంకెట్‌లో ముఖ్య అతిథిగా కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ స్వాతి కులకర్ణి పాల్గొన్నారు. ఆమెతోపాటు చైర్మన్ ఆఫ్ ఫార్‌సైత్ కౌంటీ కమిషనర్స్ ఆల్‌ఫ్రెండ్ జాన్ కూడా ఈ బాంకెట్‌కు హాజరయ్యారు. యూఎస్ఏ క్రికెట్ బోర్డు మెంబర్ వెన్యూ పిసికే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సీసీఎల్‌కు మద్దతు తెలిపారు. మిగతా నగరాలకు కూడా సీసీఎల్ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తామన్నారు. వీరితోపాటు జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ సభ్యులు ఎరిన్ ఎల్‌వుడ్, బాబ్ ఎర్రమిల్లి, జాన్స్ క్రీక్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన షఫీక్ జాదవ్‌జీ కూడా కార్యక్రమానికి హాజరై సీసీఎల్ విజయవంతంగా మరో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందించారు. చివరగా తమకు సహకరించిన పార్టిసిపెంట్లు, వాలంటీర్లు, అద్భుతమైన వంటకాలు అందించిన డెక్కన్ స్పైస్, తమ గానంతో అందరినీ అలరించిన రాగ వాహిని, ఫొటోగ్రఫీ అందించిన సురేష్ వోలమ్, మంచి సౌండ్ సిస్టం అందించిన రజినీకాంత్, డెకరేషన్ చేసిన క్రియేటివ్‌బెల్స్ సంస్థలకు, అందరికీ సీసీఎల్ ధన్యవాదాలు తెలిపింది.

 

 

Tags :