బ్రహ్మానందంను సరిగా వాడుకోండి బాసూ!
1000కి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందాన్ని అందరూ కామెడీకి కేరాఫ్ అనుకుంటాం కానీ ఆయన ఎంత గొప్ప సీరియస్ నటుడో ప్రపంచానికి తెలియ చేయాలని చూసిన వాళ్లు చాలా తక్కువ మందే. మొన్నామధ్య రంగమార్తాండ సినిమాలో కృష్ణ వంశీ అసలు జోకులేయకుండా మంచం మీద చనిపోయే సీన్ లో ప్రకాష్ రాజ్ ను సైతం బ్రహ్మానందం తన యాక్టింగ్ తో సైడ్ చేశాడు.
ఇప్పుడు మరోసారి బ్రహ్మానందం అలాంటి పాత్రే చేశాడు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఉత్సవం అనే సినిమాలో బ్రహ్మానందం దుర్యోధనుడి పాత్రలో ఏకధాటిగా డైలాగ్ చెప్పడాన్ని ట్రైలర్ లో చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. గతంలో కూడా బ్రహ్మి ఇలాంటి ప్రయత్నాలు చేశాడు. బాబాయ్ హోటల్ లో ఆయన పాత్ర తాలుకా ఎమోషన్స్ గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది.
తర్వాత అమ్మ సినిమాలో కూడా అలాంటి నటనే కనబరిచాడు. అయితే ఆయన ఎక్కువ కామెడీ రోల్స్ చేయడం, ఆ పాత్రలే ఎక్కువ వర్కవుట్ అవడంతో దర్శకులు బ్రహ్మీలోని మరో యాంగిల్ ను వాడుకునే దిశగా ఆలోచించలేదు. మొత్తానికి ఇన్నాళ్లకు బ్రహ్మికి మంచి పాత్ర దక్కిందని అభిమానులు ఫీలవుతున్నారు. డిసెంబర్ లో రానున్న తన కొడుకు సినిమా బ్రహ్మ ఆనందంలో కూడా ఆయనకు మంచి పాత్ర దక్కిందని ఇన్‌సైడ్ టాక్. ఇకనైనా డైరెక్టర్లు ఆయనకు తగిన పాత్రలు ఇస్తే ఆయనలోని సంపూర్ణ నటుడిని చూసే అవకాశముంటుంది.