మీరు ఒక రోజు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది .. సీజేఐ తీవ్ర అసహనం
సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదుల తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారు గానీ, న్యాయమూర్తుల మీద ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేందుకు స్పీకర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ శివసేన (యూబీటీ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దీనిపై ముందస్తు విచారణ చేపట్టాలని కౌన్సిల్ ధర్మాసనానికి అభ్యర్థించింది. అయితే, దీనికి సంబంధించిన పత్రాలు అందించేందుకు సమయం కావాలని ప్రతివాదులు కోరవడంతో వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో పిటిషనర్ తరపు న్యాయబృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతకంటే ముందుగానే పిటిషన్ను విచారించాలని కోరింది. దీంతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ఆగ్రహానికి గురయ్యారు.
ప్రతి ఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారే కానీ, న్యాయమూర్తుల మీద ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. న్యాయవాదులు ఒక రోజు జడ్జీల స్థానంలో కూర్చుంటే మేం ఎంత ఒత్తిడితో పనిచేస్తున్నామో అర్థమవుతుంది. ప్రతి ఒక్క పిటిషన్పై విచారణ జరుపుతాం. దానికి ఒక తేదీని నిర్ణయిస్తాం. కోర్టులు, న్యాయమూర్తులపై ఉన్న పని ఒత్తిడిని అర్థం చేసుకోండి. అంతేగానీ, మమ్మల్ని శాసించొద్దు అని సీజేఐ అసహనం వ్యక్తం చేశారు.