స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి.మల్లికార్జున్ రావు తీర్పు వెల్లడిరచారు. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వరిస్తాయని, 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికు ఏసీబీ కోర్టులో అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఎలాంటి ఆధారాల్లేవు. నిధులు విడుదల చేసినంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేం. చంద్రబాబు, టీడీపీ ఖాతాకు నిధులు మళ్లింపుపై ఆధారాలు లేవు. ప్రతి ఉపగుత్తేదారు తప్పులను సీఎంను బాధ్యుడిని చేయలేం. ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాలు లేవు. ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారు. కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి చంద్రబాబును అరెస్టు చేశారు. విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదు. ఆయన జడ్ ప్లస్ కేటగిరిలో ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్నారు. కేసు విచారణ నుంచి ఆయన తప్పించుకునే అవకాశమే లేదు. కేసు విచారణకు చంద్రబాబు విఘాతం కలిగించే అవకాశం లేదు. సీమెన్స్ డైరెక్టర్, డిజైన్‌టెక్ యజమాని వాట్సప్ సందేశాలకు, చంద్రబాబుకు సంబంధం ఏంటి? చంద్రబాబు లాయర్ల వాదనలతో అంగీకరిస్తున్నాం అని తీర్పు వెల్లడి సందర్బంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.






