పీఎఫ్ఐపై నిషేధం వెనుక ఏం జరిగింది?

పీఎఫ్ఐపై నిషేధం వెనుక ఏం జరిగింది?

దేశవ్యాప్తంగా విస్తరించిన అతివాద ఇస్లామిక్‌ సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన NIA.. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. 16 ఏళ్ల కిందట ఆవిర్భవించిన పీఎఫ్ఐ.. 22 రాష్ట్రాలకు విస్తరించింది. 4 లక్షల మందికి పైగా సభ్యులున్నారు. పవిత్ర యుద్ధం పేరుతో భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పీఎఫ్ఐ ప్లాన్ చేసిందనే ఉద్దేశంతో NIA రంగంలోకి దిగింది. ఇప్పుడు ఈడీ కూడా దీనిపై కన్నేసింది.

దసరా ఉత్సవాల్లో అల్లర్లు సృష్టించేందుకు పీఎఫ్ఐ ప్లాన్ చేసిందనే అభియోగాలు రావడంతో ఎన్ఐఏ సోదాలు విస్తృతం చేసింది. 8 రాష్ట్రాల్లో నిర్వహించిన సోదాల్లో పలు ఆధారాలు సేకరించినట్లు వెల్లడించింది. సుమారు 170 మందిని అదుపులోకి తీసుకుంది. బీజేపీ, అర్‌ఎస్ఎస్ నేతలే టార్గెట్‌గా ఈ స్కెచ్ వేశారనేది పీఎఫ్ఐపై ప్రధాన అభియోగం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలు పీఎఫ్ఐ హిట్ లిస్టులో ఉన్నారని గుర్తించింది. అంతేకాక.. పీఎఫ్ఐ ఆర్థిక మూలాలపైన కూడా కన్నేసింది ఈడీ. విదేశాల నుంచి వచ్చిన నిధులపైనా ఆరా తీస్తోంది. హవాలా మార్గంలో ఈ నిధులు వచ్చినట్లు తేల్చింది.

దేశీయంగా కూడా పీఎఫ్ఐకి పెద్ద ఎత్తున నిధులు అందినట్లు నిర్ధారణ అయింది. సుమారు 120 కోట్లకు పైగా నిధులు దేశవ్యాప్తంగా పలుప్రాంతాల నుంచి అందాయి. అయితే ఇవన్నీ నకిలీ రసీదులనేది ఈడీ అభియోగం. అబుదాబిలోని ఒక రెస్టారెంట్ ను హవాలా లావాదేవీలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్నారని ఈడీ చెప్తోంది. ఇక్కడి నుంచే భారత్ కు నిధులు పెద్దఎత్తున వచ్చాయని వెల్లడించింది. ఈకేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన అబ్దుల్ రజాక్.. మనీలాండరింగ్ వ్యవహారాలకు కీలక సూత్రధారిగా ఈడీ అనుమానిస్తోంది.

దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ ఇప్పుడు కలకలం రేపుతోంది. చాలాకాలంగా పీఎఫ్ఐ కార్యకలాపాలపై విమర్శలు వస్తున్నాయి. ముస్లింల రక్షణ పేరుతో మతవిద్వేషాలు రెచ్చగొడుతోందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మోదీ సర్కార్ పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతోంది. పీఎఫ్ఐని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తన స్వలాభం కోసమే బీజేపీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని విపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పీఎఫ్ఐపై నిషేధాన్ని వ్యతిరేకించింది. గుజరాత్ ఎన్నికల్లో లబ్దిపొందేందుకే పీఎఫ్ఐని బీజేపీ తెరపైకి తీసుకువచ్చిందనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికైతే ఈ ఇష్యూ ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇది పూర్తయితేనే మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతవరకూ మనం వేచి చూడాల్సిందే. 

 

Tags :
ii). Please add in the header part of the home page.