బైజుస్ కు మరో ఎదురుదెబ్బ.. అమెరికాలో
ఆర్థిక సమస్యలతో కష్టాల్లో చిక్కుకున్న ఎడ్యూటెక్ స్టార్టప్ బైజూస్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికాలోని బైజూస్ యూనిట్‌ను రుణ దాతలు స్వాధీనం చేసుకోవడం సబబేనని డెలావేర్ కోర్టు తీర్పు చెప్పింది. రుణ బకాయిలు చెల్లించడంలో విఫలమైనందున అమెరికాలోని బైజూస్ అనుబంధ సంస్థ బైజూస్ ఆల్ఫా లో బైజూ రవీంద్రన్ స్థానే రుణ దాతలు ఒక డైరెక్టర్‌ను నియమించడం సబబేనని తెలిపింది. బైజుస్ సంస్థకు రెడ్ వుడ్ ఇన్వెస్ట్ మెంట్స్, సిల్వర్ పాయింట్ క్యాపిటల్ సహా పలు సంస్థలు 120 కోట్ల డాలర్ల రుణం ఇచ్చాయి.
కరోనా మహమ్మారి తర్వాత ఎడ్ టెక్ బిజినెస్ దెబ్బ తినడంతో బైజుస్ రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమైంది. దీంతో అమెరికా రుణ దాతలు బైజూస్ అనుబంధ బైజూస్ అల్ఫాలో టీమోటీ పోల్ అనే వ్యక్తిని డైరెక్టర్‌గా నియమించారు. దీన్ని సవాల్ చేస్తూ బైజూస్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను డెలావేర్ కోర్టు తోసిపుచ్చింది. రుణ ఎగవేతలకు పాల్పడినందు వల్ల టీమోటీ పోల్ నియామకం సరైన చర్య అని పేర్కొంది.