ధరణి తీసేసి కాంగ్రెస్... దందాలు చేయాలని చూస్తోంది : సీఎం కేసీఆర్

ధరణి పోర్టల్‌తో అద్భుత ఫలితాలు వచ్చాయని, దళారులు లేకుండా చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజల అవసరాల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడినపుడు తలసరి ఆదాయం రాష్ట్రం 19`20 స్థానాల్లో ఉండేది. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన తర్వాత 3.18 లక్షల తలసరి ఆదాయంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. తలసరి విద్యుత్ వినియోగంలోనూ మనమే మొదటి స్థానంలో ఉన్నాం. ఓటు వజ్రాయుధం. దాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. మంచీచెడు ఆలోచించాలి. అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటేయాలి. బీఆర్‌ఎస్ పుట్టింది తెలంగాణ హక్కుల సాధన కోసమే. తెలంగాణను ఏపీలో కలిపింది కాంగ్రెస్సే. 58 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను ఆ పార్టీ ఇబ్బంది పెట్టింది. 1969 ఉద్యమ సమయంలో ఉద్యమకారులను కాంగ్రెస్ పిట్టల్లా కాల్చి చంపింది. ఆ పార్టీ హయాంలో సాగు, తాగునీటి, కరెంట్ కష్టాలు ఉండేవి. పింఛను రూ.200 మాత్రమే ఉండేది అని అన్నారు.
రాష్ట్రంలో కంటివెలుగు కార్యక్రమం వస్తుందని ఎవరైనా ఊహించారా? రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశాం. సాగునీటిపై గతంలో పన్ను ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక దాన్ని రద్దు చేశాం.ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్‌గాంధీ అంటున్నారు. దాన్ని తీసేస్తే రైతుబీమా, రైతుబంధు, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయి? పంజాబ్‌ను అధిగమించి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ధరణిని తీసేసి దందాలు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది అని విమర్శించారు.






