అందుకే నున్న ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి : సీఎం కేసీఆర్

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఏం చేసిందో గమనించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాలలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికలు రాగానే ప్రజలు ఆగం కాకూడదు. తెలివితో ఓటు వేస్తేనే తెలివైన ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రం తలరాతను మార్చే ఓటును వివేకంతో వేయాలి. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టిందే కాంగ్రెస్. ఎంతో పోరాటం చేసి తెలంగాణను మళ్లీ సాధించుకున్నాం. పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలి. గతంలో తెలంగాణలో ఎక్కడా చూసినా కరవు ఉండేది. సాగునీరు, తాగునీరు, కరెంటు కష్టాలు ఎన్నో ఉండేవి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.2 వేలు పింఛను ఇస్తున్నారా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.2 వేల పింఛను ఇస్తున్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. తెలంగాణకు వచ్చి మాత్రం కాంగ్రెస్ నేతలు రూ.4 వేలు పింఛను ఇస్తామని చెబుతున్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ గెలిస్తే పింఛన్లు క్రమంగా రూ.5 వేలకు పెంచుతామన్నారు.
సంపద పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నాం. జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిస్తే రైతు బంధు రూ.16 వేలు వస్తాయి. అదే కాంగ్రెస్ వాళ్లు గెలిస్తే ఉన్న రైతు బంధు కూడా పోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. నన్ను చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయి. రాష్ట్రానికే పరిమితం చేయాలని చూస్తున్నాయి. రాష్ట్రంలో నేను గెలిస్తే మహారాష్ట్రకు వెళ్తానని భయపడుతున్నారు. అందుకే నన్ను ఓడిరచేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు 50 టీఎంసీలతో నిండుకుండలా ఉన్నది. టపాచ్‌పల్లి రిజర్వాయర్‌కు రూ.50 కోట్లు మంజూరు చేశాం. కాలువ, పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. అది పూర్తయితే చేర్యాల ఏరియాలో కరవు అనేది అడుగుపెట్టదు అని అన్నారు.






