కారుకు బ్రేకులు?

కారుకు బ్రేకులు?

పార్టీలపై నేతలకు భ్రమలు వీడాయా? పార్టీలన్నీ అవసరాన్ని బట్టి రంగు మార్చేస్తున్నాయని అర్థమయ్యాయా? దీంతో తామే నేరుగా కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ను ఢీకొట్టాలని భావిస్తున్నారా? ప్రస్తుతం తెలంగాణలోని పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న నేతలు గతంలో కాంగ్రెస్ ను ఆశ్రయించారు. అయితే ఆ పార్టీ కారుతో కొట్లాడలేదని భావించిన మరికొందరు బీజేపీలో చేరారు. అయితే ఇటీవలి పరిణామాలతో బీజేపీకి, బీఆర్ఎస్ కు మధ్య ఏమైనా  అవగాహన ఉందా అన్న అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్ బద్ధవిరోధుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రాములమ్మతో మొదలుపెడితే, జూపల్లి, పొంగులేటి వరకూ .. అందరూ కేసీఆర్ తో ప్రయాణం ప్రారంబించి, ఇప్పుడు ఆయన పేరు ఎత్తితేనే అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రాములమ్మ, ఈటల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డికె అరుణ సహా పలువురు కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడాలన్న థ్యేయంతో బీజేపీలో చేరారు. కమలం  పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో.. బీఆర్ఎస్ తో పోరాటం సాధ్యమవుతుందని నమ్మారు. తీరా ఇప్పుడేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు ఇరుక్కుపోయారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై చర్యలకు సిద్ధమవుతున్న దర్యాప్తు సంస్థలు... కవిత వైపు చూడకపోవడంతో బీజేపీలో చేరిన నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో కాంగ్రెస్, బీజేపీతో పనికాదని తలిచిన నేతలందరూ కలిసి ఓ పార్టీ పెట్టడమా? లేదా ఓగ్రూపుగా ఏర్పడి తమతమ నియోజకవర్గాల్లో పోటీ చేసి, బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడగొట్టడం లక్ష్యంగా ముందుకెళ్లడమా అన్నదానిపై సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చిన ఈటలకు సైతం కౌన్సెలింగ్ ఇచ్చేపరిస్థితికి వచ్చారంటే.. వారి ఆలోచన సరళి ఎలా ఉందో అర్థమవుతోంది. దీనికి తోడు వివిధ పార్టీల్లోనూ అసంతృప్త నేతలు సైతం.. పార్టీల నుంచి బయటకు వచ్చే విషయమై ఆసక్తి చూపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈసారి ఎన్నికల్లో ఎక్కువమంది ఇండిపెండెంట్లు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కారు పార్టీకి రెబల్స్ బెడద అధికంగా ఉండే  పరిస్థితి గోచరిస్తోంది. టికెట్ రాని అభ్యర్థులు.. తమ ప్రత్యర్థులను ఓడగొట్టి, తమ సత్తా చాటే పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పటికే వివిధ రకాల కారణాలతో పార్టీలో చేరిన ఇతర పార్టీల నేతలు.. సైతం ఈలిస్టులో ఉండే అవకాశముంది. దీంతో విపక్షాలతో పాటు స్వతంత్రులతో బీఆర్ఎస్ తలపడే పరిస్థితి కనిపిస్తోందని రాజకీకీయ నిపుణులు చెబుతున్నారు.

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :