అమ్రిష్ పూరి బయోపిక్ వచ్చేస్తుంది...!

అమ్రిష్ పూరి బయోపిక్ వచ్చేస్తుంది...!

విలక్షణ నటుడు అమ్రిష్ పూరి బయోపిక్ తెరకెక్కుతుందా ?అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దివంగత నటుడి పై మనవడు వర్ధన్ పూరి సినిమా తీయాలనుకుంటున్నాడు అని సమాచారం. "అమ్రిష్ పూరి-నామ్ తో సునా హై హోగా " అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా వివరాల్లోకి వెళ్తే..

దేశ వ్యాప్తంగా అత్యంత పాపులారిటీ ఉన్న నటుల్లో అమ్రిష్ పూరి ఒకరు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. విలన్ గా నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. అమ్రిష్ భారత సినీ రంగానికి చేసిన సేవలు అసమానం.

మిస్టర్ ఇండియా, కోయిలా, కరణ్-అర్జున్, దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే వంటి ఎన్నో మరపురాని చిత్రాల్లో ఆయన ప్రేక్షకులని మెప్పించారు. టాలీవుడ్ లో సైతం అమ్రిష్ తన మార్క్ ని సెట్ చేసారు. కేవలం అతని గాత్రంతోనే ఇక్కడి ప్రజలు అమ్రిష్ ని గుర్తుపడ్తారంటే అతిశయోక్తి కాదు.

90 లలో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొంగ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా నటించి, తన ఆహార్యంతో ఆకట్టుకున్నాడు. అమ్రిష్ పూరీని చూశాక విలన్ అంటే ఇలానే గంభీరంగా ఉండాలి అని తెలుగు ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. నెగటివ్ పాత్రల్లో అతడి డామినేటింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ , భీకరమైన స్వరం అమ్రిష్ కి ప్లస్ పాయింట్ అయ్యాయి.

1987 శేఖర్ కపూర్ బ్లాక్ బస్టర్ సినిమా మిష్టర్ ఇండియా లో భయంకరమైన ' మొగాంబో ' పాత్రలో నటించారు. ఆయన గురించి తలుచుకున్నప్పుడు  "మొగాంబో ఖుష్ హువా " అనే మాటలు ఇప్పటికి ప్రతిధ్వనిస్తుంటాయి. అమ్రిష్ పూరి జీవిత చరిత్ర వెండితెరపైకి  వస్తున్న సందర్భంగా మొగాంబో ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మీడియాకి తెలుస్తాయని సమాచారం.

 

 

Tags :