సేనల విరమణ.. జో బైడెన్, ట్రంప్ మధ్య రగడ

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనలను హడావుడిగా ఉపసంహరించారంటూ విమర్శలను ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం నెపాన్ని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీదకు నెట్టేసింది. తాను సమర్థంగా సేనల విరమణను పూర్తి చేశానని ప్రకటించుకుంది. ట్రంప్ నిర్ణయాలు తీవ్ర సమస్యలను సృష్టించాయని ఆరోపించింది. అఫ్గాన్ నుంచి 2021 మే నెలకల్లా వైదొలగడానికి ట్రంప్ ప్రభుత్వం తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకుంది. దాన్ని తాము పాటిస్తామని అధ్యక్ష ఎన్నికలకు ముందు బైడెన్ హామీ ఇచ్చారు. అయినా సేనల విరణకు ట్రంప్ సరైన ప్రణాళిక సిద్ధం చేయలేదని విడుదల చేసిన నివేదికలో బైడెన్ ప్రభుత్వం ఆరోపించింది. ట్రంప్ కుదర్చుకున్న గడువు లోపల ఉపసంహరణ జరగకపోతే తమ సేనలపై తాలిబన్లు దాడులు పునరుద్ధరిస్తారనీ వివరించింది. ఈ నేపథ్యంలో సైన్య ఉపసంహరణను పకడ్బందీగా జరిపినందుకు తమ సర్కారు గర్విస్తోందని అమెరికా జాతీయ భద్రతా సమస్వయాధికారి జాన్ కర్బీ చెప్పుకొచ్చారు. బైడెన్ సర్కారు నివేదికను ట్రంప్ తోసిపుచ్చారు. అతి పెద్ద మూర్ఖుడి నాయకత్వంలోని వైట్‌హౌస్ మూర్ఖుల ముఠా అమెరికాను నాశనం చేస్తోందని విరుచుకుపడ్డారు.