వైసీపీ బుజ్జగింపులు విఫలం..! జనసేనలోకి బాలినేని..!?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సేఫ్ జోన్ కోసం వెతుకుతున్నారు. పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం, ఓడిపోవడం వల్ల ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, కేడర్ ను కాపాడుకోవడం.. లాంటి అనేక కారణాలు నేతల పక్కచూపులకు కారణమవుతోంది. ఇప్పటికే కొందరు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పగా మరికొందరు అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే వార్త సంచలనం కలిగిస్తోంది.
బాలినేని శ్రీనివాస రెడ్డి వైఎస్ కుటుంబ బంధువు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నారు. అయితే గతం మంత్రివర్గం నుంచి తప్పించడం, జిల్లాలో తనను కాదని వేరే వాళ్లకు కీలక బాధ్యతలు అప్పగించడం లాంటివి బాలినేనికి అస్సలు నచ్చలేదు. జిల్లాలో ఇతరుల పెత్తనాన్ని ఆయన సహించలేకపోయారు. ఈ విషయాన్ని ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. తన వ్యతిరేకులకే జగన్ మద్దతుగా ఉన్నారని అర్థమైంది. ఇటీవల ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ బాలినేని కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో కూడా పార్టీ హైకమాండ్ నుంచి ఆశించినంత మద్దతు రాలేదని ఆయన భావిస్తున్నారు.
పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో పార్టీ వీడేందుకు బాలినేని సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న జగన్.. ఆయన్ను తాడేపల్లి పిలిపించుకుని మాట్లాడారు. అయితే అక్కడా పెద్దగా పురోగతి లేకపోయింది. దీంతో ఆయన తన అనుచరులతో సమావేశమై పార్టీకి రాజీనామా చేసే విషయంపై చర్చించారు. వాళ్లు కూడా అందుకు సమ్మతించారు. అనంతరం హైదరాబాద్ వచ్చేసిన బాలినేని తాజాగా ఒంగోలు కార్పొరేటర్లందరినీ పిలిపించుకుని మాట్లాడారు. దీంతో బాలినేని కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని అర్థమైంది. ముందుగా కార్పొరేటర్ల చేత రాజీనామా చేయించి తర్వాత బాలినేని రాజీనామా చేస్తారని సమాచారం అందుతోంది.
బాలినేని ఏ పార్టీలో చేరతారనే దానిపై ఉత్కంఠ కలుగుతోంది. అయితే ఆయన జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. జనసేనాని పవన్ కల్యాణ్ నుంచి ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో బాలినేని తనకు మంచి సన్నిహితుడని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దీంతో వాళ్లిద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయని తెలుస్తోంది. బాలినేని పార్టీ వీడడం ఖాయమని తెలుసుకున్న వైసీపీ అధిష్టానం విడదల రజని, ఎమ్మెల్సీ సతీశ్ రెడ్డిని హుటాహుటిన హైదరాబాద్ పంపించి చర్చలు జరుపింది. అయితే బాలినేని మాత్రం మెత్తబడనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.