హెచ్ ఎండిఎ లే అవుట్లకు వేలం

హైదరాబాద్ నగరంలో ఆధునిక మౌలిక వసతులతో రెండు లేఅవుట్లను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. తూర్పున పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, ఉత్తరాన బాచుపల్లిలో రెండు భారీ లేఅవుట్లను అభివృద్ధి చేసి, ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు సిద్ధం చేశారు. ఔటర్ రింగురోడ్డు లోపల అత్యంత కీలకమైన ప్రాంతాలైన బాచుపల్లి, మేడిపల్లిలో విశాలమైన స్థలాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు ఎంతో అనుకూలంగా ఉండటంతో హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్‌ను రూపొందిస్తున్నారు. వరంగల్ జాతీయ రహదారికి అర కిలోమీటరు దూరంలో మేడిపల్లి రెవెన్యూ పరిధిలో 55 ఎకరాల స్థలంలో ఒక లేఅవుట్ ఉండగా, మరో లేఅవుట్ మియాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి గండి మైసమ్మ వెళ్లే మార్గంలో బాచుపల్లి ప్రాంతంలో 27 ఎకరాల స్థలంలో లేఅవుట్‌ను అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.మార్చి 2,3 తేదీల్లో బాచుపల్లి , మార్చిన 6న మేడిపల్లిలోని ప్లాట్లకు వేలం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ వేలం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు వేలం నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించామని, రిజిస్ట్రేషన్ నుంచి మొదలు కొని అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, నిర్ణయించిన తేదీల్లో ఆయా సైట్ల వద్ద ఫ్రీ బిడ్ మీటింగ్ ఉంటుందని తెలిపారు.